పాములతో హత్యకు కుట్ర! | Sakshi
Sakshi News home page

పాములతో హత్యకు కుట్ర!

Published Thu, May 29 2014 9:10 AM

పాములతో హత్యకు కుట్ర! - Sakshi

పాములు వదిలిన ఓ వ్యక్తి పట్టివేత

రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా అనుమానం

హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: మనిషిని చంపేందుకు కత్తి, తుపాకీ ఇతర ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఓ వ్యక్తి తాచుపాములను ఆయుధంగా వాడాడు. ఇదే తరహాలో గతంలో నాలుగుసార్లు ప్రయోగించడంతో అప్రమత్తమైన ఆ కుటుంబం చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఇన్‌స్పెక్టర్ భీమ్‌రెడ్డి, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణగూడ విఠల్‌వాడి చౌరస్తాలో అమర్‌జిత్‌రెడ్డి (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. గత నాలుగు నెలలుగా ప్రతి అమావాస్య రోజు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి గడపలో ఓ సంచి వదిలి వెళ్లడం గమనించారు. తెరిచి చూడగా ఓ సంచిలో తాచుపాము, నవ ధాన్యాలు, పసుపు కుంకుమ తదితర సామగ్రి ఉండడంతో భయాందోళనకు గురయ్యారు.

వదిలిన పాము బతికుండగా, మిగిలినవి గాలి ఆడక చనిపోతుండేవి. అయితే వరుసగా జరుగుతున్న ఈ సంఘటపై అప్రమత్తమైన అమర్‌జిత్‌రెడ్డి తన ఇంటి ముందు సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సరిగ్గా 9 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు కొత్త హోండా స్కూటర్‌పై వచ్చి ఓ సంచిని అతని ఇంటి ముందు వెళ్లి పారిపోతున్నారు.

అప్పటికే ఆ వీధి వారిని అప్రమత్తం చేసి ఉండడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన ఓ మాసం దుకాణం యజమాని స్కూటర్‌నె వెంబడించి అగంతకులను నిలువరించారు. అప్పటికే ఓవ్యక్తి పారిపోయాడు. ఈ సంఘటనలో లాలాగూడకు చెందిన రైల్వే డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుని స్కూటర్ డిక్కీ తెరవగా మరో రెండు పాములు డబ్బాలో చనిపోయి కనిపించాయి.. అయితే, నిందితుడు ఎందుకిలా చేశాడనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement