చేతులెత్తేశారు! | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు!

Published Wed, Oct 31 2018 10:18 AM

Contractors Helpless In Sky Ways And FOBs in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోడ్డు దాటడంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు 52 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు(ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు), 8 జంక్షన్లలో స్కైవేల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఈ పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యేలాలేవు. నగరంలో ఎఫ్‌ఓబీల పనులు ఒకడుగు ముందుకు.. వందడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే తంతు. గతంలో ఎఫ్‌ఓబీలను నిర్మించే కాంట్రాక్టు ఏజెన్సీలకు వాటిపై ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మించేవారు. ఆ విధానంలో ప్రజలకు ఉపయుక్తమైన ప్రాంతాల్లో కాకుండా కేవలం ప్రకటనల ఆదాయం కోసం..అవసరం లేని ప్రాంతాల్లో నిర్మిస్తున్నారనే ఆరోపణలతోపాటు, ప్రజలు నడిచేందుకంటే ప్రకటనల కోసమే వాటిని ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు రావడంతో అప్పటికే పిలిచిన టెండర్లను సైతం రద్దు చేసి ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

కొత్త పద్ధతిలో భాగంగా ఎఫ్‌ఓబీల కయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలే భరిస్తాయి. వాటిపై ప్రకటనల ఆదాయం కోసం టెండర్లను ఆహ్వానించాలనేది యోచన. తద్వారా ఎఫ్‌ఓబీలపై ప్రకటనల స్థలాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు ప్రయోజనకరంగా మాత్రమే వీటిని కట్టాలని భావించారు. అందులో భాగంగా పాతవాటినన్నింటినీ పక్కనబెట్టి గత జూలైలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, టెండర్లను ఆహ్వానించారు. 52 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలతోపాటు 8 జంక్షన్లలో స్కైవేల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. నాలుగు ప్యాకేజీలకు గాను కేవలం ఒకే ప్యాకేజీ (ఎల్‌బీనగర్‌ జోన్‌)కి ఒకే ఒక్క టెండరు దాఖలైంది. మిగతా మూడు ప్యాకేజీలకు అసలు టెండర్లే రాలేదు. తిరిగి పిలుద్దామనుకునేలోగా ముందస్తు ఎన్నికల ప్రకటన రావడంతో పిలిచే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చిన టెండరు అగ్రిమెంట్‌ పూర్తికాకపోవడంతో అదీ స్తంభించింది. ఎన్నికలు పూర్తయితే కానీ.. తిరిగి టెండర్లు పిలిస్తే అప్పటికైనా కాంట్రాక్టర్లు వస్తారో, రారో తెలియని పరిస్థితి.

కారణాలెన్నో...
ఎఫ్‌ఓబీలంటే వ్యాపార ప్రకటనల ఆదాయాన్నే ప్రధానంగా భావించే  కాంట్రాక్టర్లు కొత్త విధానం తమకు లాభసాటి కాదని రాలేదని తెలుస్తోంది. దాంతోపాటు తమ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిర్దిష్ట ప్రాంతాల్లోనే నిర్మించాల్సి ఉండటం.. నిర్ణీత వ్యవధి వరకు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉండటంతో వెనుకడుగు వేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఒక్కో ప్యాకేజీ విలువ రూ. 40 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు ఉండటంతో టెండర్లలో పాల్గొనాలంటే నిర్ణీత వ్యవధిలో అందులో 50 శాతం మేర విలువైన పనుల్ని పూర్తిచేసి ఉండాలి. ఈ నిబంధనతో కాంట్రాక్టర్లు  ముందుకు రారనే గత అనుభవాలతో  25 శాతం మేర విలువైన పనులకు పరిమితం చేస్తూ నిబంధన సడలించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని త్వరత్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని తెలుస్తోంది.  ముందస్తు  ఎన్నికల ఊహ కూడా లేని తరుణంలోనే టెండర్లు పిలిచినప్పటికీ.. ఎన్నికల దృష్టితో ఎస్సార్‌డీపీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతోసహ వివిధ పనుల్ని త్వరితంగా పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడాన్ని పరిగణనలోకి తీసుకొని వెనుకడుగు వేసినట్లు సమాచారం.

స్టీల్‌ స్కైవేలు..
ఎఫ్‌ఓబీలతో పాటు అత్యంత రద్దీ  ఉన్న ఎనిమిది జంక్షన్లలో స్టీల్‌  స్కైవేలు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.ఆయా జంక్షన్లలోని  పరిస్థితుల కనుగుణంగా  ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్లేందుకైనా  వర్తులాకారంలో, త్రిభుజారకారంలో, చతురస్రాకారంలో వీటిని ఏర్పాటు చే సేందుకు టెండర్లు పిలిచారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాలుగు వైపులకు వెళ్లేలా, మెహదీపట్నంలో మూడు వైపులకు వెళ్లేలా స్కైవేలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 52 ఎఫ్‌ఓబీల్లో 39 ఎఫ్‌ఓబీలకు అవసరమైన రూ. 75 కోట్లు హెచ్‌ఎండీయే, మిగతావి జీహెచ్‌ఎంసీ నిధుల నుంచి వెచ్చించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.  

ప్యాకేజీలు.. అంచనా వ్యయం ..
ప్యాకేజీ–1(ఎల్‌బీనగర్‌జోన్‌):  11 ఎఫ్‌ఓబీలు, 1 స్కైవే : రూ. 40.14కోట్లు
ప్యాకేజీ–2(చార్మినార్‌జోన్‌): 11 ఎఫ్‌ఓబీలు, 1 స్కైవే :  రూ. 37.93 కోట్లు
ప్యాకేజీ–3(ఖైరతాబాద్,సికింద్రాబాద్‌ జోన్లు):16 ఎఫ్‌ఓబీలు, 4 స్కైవేలు:రూ. 75.79 కోట్లు
ప్యాకేజీ–4(కూకట్‌పల్లి,శేరిలింగంపల్లి జోన్లు)) : 14 ఎఫ్‌ఓబీలు, 2 స్కైవేలు: రూ. 53.85 కోట్లు.

 స్కైవేలు ఎక్కడెక్కడ..
1.ఉప్పల్‌ రింగ్‌రోడ్డు 2.ఆరాంఘర్‌ చౌరస్తా 3.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ 4.లక్డీకాపూల్‌ 5.రోడ్‌ నెంబర్‌ 1, 12 జంక్షన్, బంజారాహిల్స్‌ 6.మెహదీపట్నం 7.సుచిత్రా జంక్షన్‌ 8.బోయిన్‌పల్లి క్రాస్‌రోడ్‌

ఎఫ్‌ఓబీలు ఎక్కడ..
రామకృష్ణామఠం (ఇందిరాపార్కు ఎదుట), చిలకలగూడ రింగ్‌రోడ్,  మహావీర్‌ హాస్పిటల్, చెన్నయ్‌ షాపింగ్‌మాల్‌(మదీనగూడ), హైదరాబాద్‌ సెంట్రల్‌మాల్, ఆల్విన్‌క్రాస్‌రోడ్స్‌ (మియాపూర్‌), ఉప్పల్‌ రింగ్‌రోడ్, హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ (రామంతాపూర్‌), ఇందిరానగర్‌ జంక్షన్‌(గచ్చిబౌలి), నేరెడ్‌మెట్‌ బస్టాప్, గాంధీ హాస్పిటల్, కేవీఆర్‌ కాలేజ్‌(సంతోష్‌నగర్‌), గెలాక్సీ(టోలిచౌకి), ఆరె మైసమ్మటెంపుల్‌ (లంగర్‌హౌస్‌), సాయిసుధీర్‌కాలేజ్‌(ఏఎస్‌రావునగర్‌), రాయదుర్గం జంక్షన్, ఒయాసిస్‌ స్కూల్‌(షేక్‌పేట), ఈఎస్‌ఐ హాస్పిటల్‌(ఎర్రగడ్డ), విజేత సూపర్‌ మార్కెట్‌(చందానగర్‌), వర్డ్‌ అండ్‌ డీడ్‌ స్కూల్‌ (హయత్‌నగర్‌), హెచ్‌ఎండీఏ(మైత్రివనం), జీడిమెట్ల బస్టాప్, నోమ ఫంక్షన్‌ హాల్‌(మల్లాపూర్‌), రంగభుజంగ థియేటర్‌(షాపూర్‌నగర్‌), స్వప్న థియేటర్‌(రాజేంద్రనగర్‌), సన్‌సిటీ(బండ్లగూడ), సుచిత్ర సర్కిల్, ఐడీఏ ఉప్పల్, విశాల్‌మార్ట్‌(అంబర్‌పేట), బిగ్‌బజార్‌(ఐఎస్‌ సదన్‌), దుర్గానగర్‌ టి జంక్షన్, సుష్మ థియేటర్‌ (వనస్థలిపురం), నెహ్రుజూలాజికల్‌పార్క్, ఓల్డ్‌కర్నూల్‌రోఓడ్‌ టి జంక్షన్‌(ఉందానగర్‌ దగ్గర),  అపోలో హాస్పిటల్‌(సంతోష్‌నగర్‌), ఒమర్‌ హోటల్, సైబర్‌ గేట్‌వే(హైటెక్‌సిటీ) తదితర ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మించాలని ప్రతిపాదించారు.

Advertisement
Advertisement