జేబు దొంగలు దొరికారు.. | Sakshi
Sakshi News home page

జేబు దొంగలు దొరికారు..

Published Tue, Sep 16 2014 12:35 AM

జేబు దొంగలు దొరికారు.. - Sakshi

 - పోలీసుల అదుపులో ఐదుగురు..
- సీసీ కెమెరాతో చిక్కిన వైనం
- దొంగల్లో బాలుడు
 వేములవాడ అర్బన్ : వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం ఐదుగురు దొంగలు పర్సులు కొట్టేస్తూ ఎస్పీఎఫ్ పోలీసులకు చిక్కారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచే పలువురు భక్తుల డబ్బులు, సెల్‌ఫోన్లు దొంగతనానికి గురైనట్లు ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీఎఫ్ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ మహేందర్, గణేశ్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి దొంగలను పట్టుకునే పనిలోపడ్డారు. అప్పటికే అనుమానం కలిగిన కొందరిని ప్రశ్నించి వదిలిపెట్టారు. అయినా దొంగల బెడద పెరుగుతూనే వచ్చింది.

ఈలోగా ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఆమేటి లక్ష్మి భర్త విజయ్‌కుమార్ తన పర్సును క్యూలైన్లో ఎవరో కొట్టేశారని ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఓ బాలుడు తనను వెంబడించి జేబులోని డబ్బులు తీశాడని క్లూ ఇచ్చాడు. దీంతో వారంతా కలిసి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. అందులో ఓ బాలుడు పర్సు కొట్టేసినట్లు నిర్ధారించుకున్నారు. ఈక్రమంలో పరుగులు తీస్తున్న బాలుడిని ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకుని ప్రశ్నించారు. దీంతో అసలు రంగు బయటపడింది.

సిద్దిపేటకు చెందిన ఈ బాలుడితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీధర్, నగేశ్, రాకేశ్ దొంగతనాలు చేరుుస్తున్నట్లు తేలింది. శాస్త్రీనగర్‌లోని లాడ్జి వెళ్లి తనిఖీ చేయగా ఈ ముగ్గురు దొరికినట్లు ఎస్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. రెండురోజులుగా లాడ్జిలోనే మకాం వేసి ఈ బాలుడితో దొంగతనాలు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారివద్ద నుంచి తొమ్మిది సెల్‌ఫోన్లు, కొంత నగదు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుల్తానాబాద్‌కు చెందిన సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలుడు జేబు దొంగతనాలు చేస్తూ ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.

Advertisement
Advertisement