చిన్న పరిశ్రమకు పెద్ద సమస్య  | Sakshi
Sakshi News home page

చిన్న పరిశ్రమకు పెద్ద సమస్య 

Published Sun, Apr 19 2020 1:25 AM

Corona Effect: Big problem for Small Scale Industries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు కోలుకునేందుకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. పెద్ద కంపెనీల నుంచి వచ్చే ఆర్డర్లపైనే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల మనుగడ ఆధారపడి ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం 25 శాతం ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు శాశ్వతంగా మూతపడే అవకాశం ఉందని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలతో పాటు పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు నిర్ణయం తీసుకోవాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారతీయ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కి), అసోచామ్‌ కేంద్రాన్ని కోరాయి. 

10 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు 
తెలంగాణ పరిశ్రమల సమాఖ్య (టిఫ్‌) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా సుమారు 15 లక్షలకు పైగా మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించిన వేతనాలను సర్దుబాటు చేసిన ఎంఎస్‌ఎంఈలు తమ ఖాతాల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఏప్రిల్‌ వేతనాల చెల్లింపుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపు తెలివైన నిర్ణయమే అయినా తమ పరిశ్రమల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో తమ వద్ద నగదు నిల్వలు నిండుకుంటే తలెత్తే పరిస్థితిపై ఆందోళన చెందుతున్నాయి. 

నిబంధనలు సడలించాలని వినతి 
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున నిబంధనలు సడలించేలా ఆర్‌బీఐకి ఆదేశాలు జారీ చేయాలని పారిశ్రామిక సంఘాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. నిరర్ధక ఆస్తుల గుర్తింపు నిబంధనలను కనీసం రెండేళ్ల పాటు సడలించాలని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు కోరుతున్నాయి. మరోవైపు రుణాల అసలు, వడ్డీ చెల్లింపుపై ప్రభుత్వం విధించిన మూడు నెలల మారటోరియాన్ని కూడా పొడిగించాలని ఎంఎస్‌ఎంఈలు డిమాండ్‌ చేస్తున్నాయి. రుణాల చెల్లింపుపై మారటోరియంతో పాటు వడ్డీ రేట్ల తగ్గింపు, నిర్వహణ పెట్టుబడి, మార్టగేజ్‌ రుణాల మంజూరులో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీ.. 
లాక్‌డౌన్‌ మూలంగా దేశవ్యాప్తంగా రోజుకు రూ.40 వేల కోట్లు నష్టం వాటిల్లుతుండగా, ఇందులో పారిశ్రామిక రంగం వాటా ఎక్కువగా ఉందని సీఐఐ, ఫిక్కి వంటి సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగాల వారీగా భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఈ సంఘాలు కోరుతున్నాయి. దేశ జీడీపీలో 5 శాతం మేర అనగా సుమారు రూ.10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామిక రంగానికి ప్రకటించాలనేది వీరి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలతో పాటు పారిశ్రామిక రంగానికి ఊతం లభిస్తుందని ‘టిఫ్‌’వర్గాలు వెల్లడించాయి. ఇటు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎరువులు, విత్తనాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్, బ్రేవరేజెస్‌ పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.  

Advertisement
Advertisement