కరోనా: తెలంగాణలో మరో 31 పాజిటివ్‌ | Sakshi
Sakshi News home page

కరోనా: తెలంగాణలో మరో 31 పాజిటివ్‌

Published Sun, May 10 2020 2:20 AM

Coronavirus 31 New Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకుంటు న్నాయి. చాలా రోజులుగా తక్కువగా నమోదైన కేసులు.. శనివారం ఏకంగా 31 నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధి లోనే 30 కేసులు నమోదు కావ డం ఆందోళన కలిగిస్తోంది. మరో కేసు ముంబై నుంచి వచ్చిన వలస వ్యక్తి అని అధికారులు తెలిపారు. కేసుల వివరాలను ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు విడుదల చేసిన బులె టిన్‌లో వెల్లడించారు. 

కాగా, కరోనాతో ఓ వ్యక్తి శనివారం చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,163కు చేరింది. తాజాగా 24 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు మొత్తం 751 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 382 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కోలుకొని డిశ్చార్జి అయినవారిలో హైదరాబాద్‌కు చెందిన 13 మంది ఉన్నారు. గద్వాల జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. సూర్యాపేట, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ఇద్దరు చొప్పున ఉన్నారు. వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
(చదవండి: సహజీవనం చేయాల్సిందే)

ఒకే కుటుంబంలో 8 మందికి..
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా పరీక్షలు చేయగా, వీరిలో 8 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్న మరో 8 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

23 జిల్లాల్లో 14 రోజులుగా కేసుల్లేవ్‌..
గత 14 రోజులుగా అసలే కేసులు నమోదు కాని జిల్లాలు 23 ఉన్నాయని శ్రీనివాస్‌రావు తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్లగొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట్, నిర్మల్‌ జిల్లాల్లో కేసులు నమోదు కాలేదని చెప్పారు. కాగా, వరంగల్‌ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా రాలేదని తెలిపారు.

పుట్టిన బాబుకు కరోనా లేదు: మంత్రి ఈటల
కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణికి శుక్రవారం బాబు పుట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ బాబుకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆ బాబు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. తల్లికి వైరస్‌ ఉన్నప్పటికీ బాబుకి వైరస్‌ లేకపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. 
(చదవండి: వద్దంటే వింటారా... పిండుడు మానుతారా..! )

Advertisement
Advertisement