Sakshi News home page

దేవాదాయ శాఖలో లంచావతారం

Published Wed, Oct 15 2014 3:13 AM

దేవాదాయ శాఖలో లంచావతారం - Sakshi

ఖమ్మం క్రైం: దేవాదాయ శాఖలో ఈవోగా పనిచేస్తూ.. తన కిందిస్థాయి సిబ్బంది వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మంగళవారం ఖమ్మంలో చోటుచేసుకుంది.  ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. వైరా మండలం గొల్లపుడి పులిగుట్ట నరసింహస్వామి ఆలయ ఈవో పెద్ది సత్యనారాయణ నగరంలోని గుంటు మల్లేశ్వరస్వామి దేవస్థానంతోపాటు మరో రెండు దేవాలయాలకు ఇన్‌చార్జి ఈవోగా పనిచేస్తున్నారు. పులిగుట్ట నరసింహస్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దిరిశాల శ్రీనివాస్ సంవత్సర కాలంగా డిప్యుటేషన్‌పై ఖమ్మం వైరారోడ్డులోని జలాంజనేయస్వామి దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ 2005 పీఆర్‌సీ విడుదల చేయడంతో దానికి గాను ఆ బిల్లులు రూ.లక్ష విడుదల చేయమని శ్రీనివాస్ ఈవో సత్యనారాయణను కోరాడు. అందుకు ఖర్చవుతుందని, రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఈవో చెప్పాడు. తాను నెలకు రూ.7వేల వేతనంతో పనిచేస్తున్నానని, అంత డబ్బు ఇవ్వలేనని, చాలా కష్టాల్లో ఉన్నానని శ్రీనివాస్ బతిమిలాడినా ఈవో ససేమిరా అన్నాడు. కొంతకాలం ఆయన చుట్టూ తిరిగి విసిగి వేసారిన శ్రీనివాస్ ఏసీబీ డీఎస్పీని సంప్రదించాడు. దీంతో డీఎస్పీ సూచన మేరకు సత్యనారాయణకు రూ.10 వేలు లంచం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ డబ్బు తీసుకుని గుంటుమల్లన్న స్వామి గుడికి వస్తానని శ్రీనివాస్ చెప్పగా.. తానే  జలాంజనేయస్వామి గుడికి వచ్చి తీసుకుంటానని సత్యనారాయణ చెప్పాడు.

కాగా, రూ.1000 నోట్లు పదింటికి పౌడర్ పూసి శ్రీనివాస్‌కు ఇచ్చిన ఏసీబీ సిబ్బంది గుడి ప్రాంతంలో మాటువేశారు. ఈవో ఆలయంలోకి వస్తుండగానే శ్రీనివాస్ గుడి గోడ పక్కన ఉన్న రోడ్డుపై నిల్చుని డబ్బులు ఈవో ఇచ్చాడు. సత్యనారాయణ ఆ డబ్బును జేబులో పెట్టుకుంటుండగానే పక్కనే ఉన్న ఏసీబీ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈవోనుంచి రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకుని అతడిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి వచ్చిన సత్యనారాయణ మొదటి నుంచి లంచాలకు అలవాటు పడి కిందిస్థాయి సిబ్బందిని బాగా వేధిస్తున్నాడని, దీనికితోడు ఆయన పనిచేస్తున్న ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కూడా మాయం చేసేవాడని తోటి సిబ్బంది తెలుపుతున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ సాయిబాబాతోపాటు ఏసీబీ సీఐ సాంబయ్య, శ్రీనివాసరాజు, సిబ్బంది పాపారావు, శ్రీనివాసాచారి, అజీజ్ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement