Sakshi News home page

వర్ష వి‘పత్తి’!

Published Thu, Oct 12 2017 2:51 AM

Cotton seeds sprouting in millions of acre - Sakshi

నోటికాడికొచ్చిన కూడు నేల పాలైనట్లు కోత దశకు వచ్చిన పత్తి నీటి పాలైంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు పత్తి రైతును కుదేలు చేశాయి. 15 జిల్లాల్లోని దాదాపు మూడో వంతు పత్తి కాయల్లోని గింజలు మొలకెత్తినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కొన్నిచోట్ల ఆకులు కూడా వచ్చాయని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఏర్పడలేదని చెబుతున్నారు. నిరంతర వర్షాలతో తెల్లటి పత్తి కాస్తా నల్ల రంగులోకి మారిందని నిర్ధారించారు. మిగిలిన జిల్లాల్లోనూ పత్తికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, ముఖ్యంగా పత్తి పంటను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రస్థాయి బృందాలు పలు జిల్లాల్లో రెండు రోజులు పర్యటించాయి. ఈ మేరకు పత్తి పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు అధికారులు తేల్చిచెప్పారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తోపాటు నల్లగొండ, వికారాబాద్‌ తదితర జిల్లాల్లోనూ పరిస్థితి ఘోరంగా ఉందని అంచనా వేశారు. జూన్‌లో కురిసిన తొలకరి వర్షాలకు వేసిన ముందస్తు పత్తి దారుణంగా దెబ్బతిన్నదని, అది చేతికొచ్చే పరిస్థితి కష్టమేనని వ్యవసాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో వ్యవసాయ శాఖ ఆందోళనలో ఉంది. చేతికొచ్చిన పంట పరిస్థితి ఇలా తయారవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.  
–సాక్షి, హైదరాబాద్‌

1.35 లక్షల ఎకరాల్లో  పత్తి ధ్వంసం.. 
రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న తేలికపాటి నుంచి భారీ వర్షాలతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. బుధవారం నాటికి వ్యవసాయ శాఖ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం 1.61 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అందులో అత్యధికంగా 1.35 లక్షల ఎకరాల్లో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 23 వేల ఎకరాలు, మొక్కజొన్న 1,698 ఎకరాలు, వేరుశనగ 1,782 ఎకరాల్లో దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే పత్తి పంటకు 47 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. జనగామ, కరీంనగర్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, రంగారెడ్డి, వనపర్తి, వరంగల్‌ అర్బన్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నల్లగొండ, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లోని 111 మండలాల్లో 777 గ్రామాల్లో నష్టం వాటిల్లిందని వివరించింది. వర్షాలు అధికంగా పడిన ఇతర చోట్ల పంటల నష్టం వాటిల్లినట్లు వివరించింది. 79 వేల మంది రైతులకు పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. 33% కంటే ఎక్కువే నష్టం వాటిల్లడంతో  విపత్తు నిర్వహణ శాఖ నిబంధనల ప్రకారం కేంద్రం నష్టపరిహారం ప్రకటించడానికి వీలుందన్నారు.

పత్తిపై ఆశలు పెట్టుకుంటే.. 
ఈ ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా పత్తి సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 47.72 లక్షల (114%) ఎకరాల్లో సాగైంది. 2016లో పత్తి వేయవద్దని ప్రభుత్వం చెప్పడంతో కేవలం 31 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. కానీ అప్పట్లో పత్తికి మార్కెట్లో డిమాండ్‌ పెరిగి మంచి రేటు రావడంతో ఈసారి రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపారు. గతేడాది కంటే ఈసారి అదనంగా 16 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుచేశారు. రైతాంగం ఆహార ధాన్యాలను పట్టించుకోలేదు. దీంతో ఈసారి ఏకంగా 8 లక్షల ఎకరాల ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గింది. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 19.07 లక్షల (82%) ఎకరాలకే పరిమితమైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎంత పత్తికి నష్టం వాటిల్లిందనే అంచనాల్లో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది.  

పత్తి కొనుగోలుకు సీసీఐ ససేమిరా..
దసరా తర్వాత పత్తి కోత ప్రారంభిద్దామని భావించిన రైతులకు భారీ వర్షాలు కొంపముంచాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, మిడ్జిల్‌ మండలాల్లో దసరా ముందు నాటికి 10 శాతం పత్తి కాయలే పగిలాయి. వాటిల్లో చాలామటుకు దూది తీసే పరిస్థితి లేదు. దసరా తర్వాత ఎక్కువ కాయలు పగులుతాయని, అప్పుడే అన్నింటికీ కలిపి దూది తీయవచ్చని రైతులు భావించారు. వర్షాలకు పగిలిన కాయల్లోని పత్తి గింజలు మొలకెత్తాయి. దూది నల్లరంగులోకి మారిపోయిందని రాష్ట్ర బృందాలకు రైతులు విన్నవించారు. దూది నల్లరంగులోకి వచ్చి పనికిరాకుండా పోయిందని వ్యవసాయ బృందం కూడా నిర్ధారించింది. మార్కెట్లో దీన్ని ఎవరూ కొనరని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అధికారుల దృష్టికి తీసుకెళ్లగా నిబంధనల ప్రకారం వాటిని ఏమాత్రం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. రైతులు మాత్రం రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. 

Advertisement
Advertisement