మండలిలో రుణమాఫీ రగడ | Sakshi
Sakshi News home page

మండలిలో రుణమాఫీ రగడ

Published Tue, Mar 17 2015 1:02 AM

మండలిలో రుణమాఫీ రగడ - Sakshi

  • అది వడ్డీమాఫీ పథకమేనంటూ విపక్షాల ఎద్దేవా
  • వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామన్న సర్కారు
  • సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ అంశం సోమవారం శాసనమండలిలో గందరగోళం సృష్టించింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని చెప్పుకొంటోందని... కానీ వాస్తవానికి చేసింది వడ్డీమాఫీ మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో విమర్శించారు. రుణ మాఫీ పేరిట ప్రభుత్వం మొదటి విడతగా ఇచ్చిన సొమ్ము రైతులు తీసుకున్న రుణాల వడ్డీకి కూడా సరిపోలేదని ఆయన పేర్కొన్నారు.

    కొన్ని జిల్లాల్లో రైతులకు ఎలక్ట్రానిక్ పహానీలు లేనందున రుణాల రెన్యువల్‌కు అర్హత కోల్పోతున్నారని, చేతి రాతతో ఇచ్చిన పహానీలను బ్యాంకులు అనుమతించడం లేదని చెప్పారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా.. లేదా?.. వస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నారని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించగా... వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమాధానమిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీతో సహా రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు.

    రుణాల రెన్యువల్‌కు ఎలక్ట్రానిక్ పహానీలు తప్పనిసరి కాదని, ఈ కారణం చేత రుణాలు రెన్యువల్ కాని రైతుల వివరాలను సమర్పిస్తే ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. కౌలురైతులకు కూడా రుణ అర్హత కల్పించేందుకు ‘లోన్ ఎలిజిబిలిటీ’ కార్డు(ఎల్‌ఈసీ)లను రెవెన్యూ యంత్రాంగం జారీ చేస్తుందని పోచారం తెలిపారు. ఇక ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగించే వారికోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

    మజ్లిస్ సభ్యులు హసన్ జాఫ్రీ, హైదర్ రజ్వీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అంధ విద్యార్థుల పాఠశాలల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని, అంధ విద్యార్థుల పరిస్థితులను తెలుసుకునేందుకు సభాసంఘం వేయాలని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మంత్రి తుమ్మల జవాబిస్తూ.. అంధ పాఠశాలల్లో సదుపాయాల పరిశీలనకు ముగ్గురు సభ్యులతో కమిటీని వేస్తామని, కమిటీ నివేదిక మేరకు ఆయా పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో మెట్రోరైలును మరో ఆరు ప్రాంతాలకు విస్తరించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి తుమ్మల చెప్పారు.

Advertisement
Advertisement