మండలి ఫలితాలు నేడే | Sakshi
Sakshi News home page

మండలి ఫలితాలు నేడే

Published Wed, Mar 25 2015 2:32 AM

council  results  today

 ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం
హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీకి హైదరాబాద్‌లో..
నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి నల్లగొండలో కౌంటింగ్
 
  సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఇస్సామియా బజార్‌లో విక్టరీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ స్థానంలో లక్షా 11 వేలకు పైగా ఓట్లు పోలవ్వగా... లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటుచేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో జరుగుతుంది. ఇక్కడ 1.5 లక్షలకు పైగా ఓట్లు పోలవ్వగా.. 20 టేబుళ్లను ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు 15 రౌండ్ల పాటు జరుగనుంది. మొత్తం 400 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

 ఉత్కంఠగా అధికార టీఆర్‌ఎస్..
 మండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎన్నికల ప్రచారంలో మంత్రులను సైతం మోహరించిన అధికార టీఆర్‌ఎస్ వర్గాలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. పోలింగ్ ముగిశాక విజయం తమ అభ్యర్థులదే అని ఎంతో ధీమాగా ప్రకటించినా... మొదటి ప్రాధాన్య ఓటుతో బయటపడే అవకాశం లేదని, రెండో ప్రాధాన్య ఓటుతో విజయం సాధిస్తామని పేర్కొంటున్నాయి.
 
 ఓట్ల లెక్కింపు ఆపలేం: హైకోర్టు
 శాసన మండలి ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని మంగళవారం తేల్చి చెప్పింది. ఎన్నికపై అభ్యంతరాలుంటే సంబంధిత ఫోరం ముందు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, ఆ ఫోరం తుది నిర్ణయానికి లోబడే ఎన్నికల ఫలితాలుంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ పట్టభద్రుడు కాదని, అయినా ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారని పేర్కొంటూ మండలి ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీశైలం మంగళవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ వాదనను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తోసిపుచ్చారు. నిబంధనల ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసే వ్యక్తి పట్టభద్రుడై ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సందర్భంగా ధర్మాసనం పరిశీలనకు వచ్చింది.
 
 ఓట్ల లెక్కింపు ఇలా..
  ఓట్ల లెక్కింపు మూడు దశల్లో ఉంటుంది.
  తొలిదశలో బ్యాలెట్ బాక్సులు తెరిచి, పోలైన ఓట్ల సంఖ్య, తెరిచిన బ్యాలెట్ల సంఖ్యను సరిచూస్తారు. 50 చొప్పున బ్యాలె ట్ పత్రాలను కట్టగట్టి.. వాటిని కలిపేస్తారు. తద్వారా ఏ పోలింగ్ స్టేషన్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఉండదు.
  రెండో దశలో ఒక్కో అభ్యర్థికి మొదటి ప్రాధాన్యతగా ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కిస్తారు. చెల్లుబాటైన మొత్తం ఓట్లలో ఏఅభ్యర్థికైనా సగానికి (50 శాతానికి) పైగా ఓట్లు లభిస్తే విజేతగా ప్రకటిస్తారు. మొదటి రౌండ్‌లోనే ఇది జరిగితే.. అప్పటితో ఓట్ల లెక్కింపు ఆపేస్తారు. లేకపోతే లేకపోతే కౌంటింగ్ కొనసాగుతుంది.

  మూడోదశలో అభ్యర్థుల తొలగింపు (ఎలిమినేషన్) చేపడతారు. తొలిరౌండ్ ఓట్లలో అందరి కంటే తక్కువగా ‘మొదటి ప్రాధాన్యత’ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలుత లెక్కింపు నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు (సదరు అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారు రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికైతే వేస్తారో వారికి) బదిలీ చేస్తారు. ఇలా ఒక్కో రౌండ్‌ను పొడిగిస్తూ.. 50 శాతం కోటా ఓట్లు వచ్చేంత వరకు లెక్కించి.. విజేతను ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చినవారు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే.. వారిలో ఎవరిని ముందుగా తొలగించాలో నిర్ణయించేందుకు రిటర్నింగ్ అధికారి లాటరీ వేస్తారు.

Advertisement
Advertisement