కరోనా ఎఫెక్ట్‌ ; ఫోన్‌లో సమాచారం ఇచ్చి ఇంటి వద్దే.. | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌ బేజార్‌..

Published Wed, Mar 18 2020 11:18 AM

COVID 19 Effects on Hyderabad People And Software Employees - Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నగరంలోని వివిధరంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నగరంలో కరోనా మొదటి కేసు నమోదైనప్పటి నుంచి పర్యాటకులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వివిధ పనుల నిమిత్తం నగరానికి రావాలనుకునే వారు కూడా పనులను వాయిదా వేసుకోవడంతో నగరంలోని లాడ్జీలు, హోటళ్లు వెలవెలబోతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారిని సైట్‌ సీయింగ్‌ తీసుకుని వెళ్లే ట్యాక్సీ కార్ల పరిస్థితి అంతే దారుణంగా తయారైంది. ఒక్క సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉండే రెజిమెంటల్‌బజార్‌లో సుమారు 120 లాడ్జీలు ఉన్నాయి. ప్రతిరోజు మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి నగర పర్యటనకు వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో ఇక్కడి లాడ్జీలు 80 శాతం ఆక్యుపెన్సీతో ఉండేది. కానీ ఇప్పుడు 50 గదులుండే లాడ్జిలో కనీసం 7 రూములు కూడా బుక్‌ కావడం లేదు. కొన్ని లాడ్జీల్లో ఒకటి రెండు గదులకే పరిమితం అయ్యాయి.  – రాంగోపాల్‌పేట్‌

గచ్చిబౌలి: ఇటలీ నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో ఐటీ కంపెనీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కరోనానెగిటివ్‌ రిపోర్ట్స్‌ రావడంతో మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లోని కంపెనీలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో ఐటీ కంపెనీలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని కొన్ని కంపెనీలో వర్క్‌ ఫ్రం హోంకు అవకాశం కల్పించాయి.  

బుకింగ్స్‌ క్యాన్సిల్‌
సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడంతో పాటు ఈ నెల 31 వరకు అన్ని మాల్స్, పర్యాటక ప్రాంతాలను బంద్‌ చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రతి హోటల్‌లో రాబోయే 20 రోజుల ముందుఉండే బుకింగ్‌ను కూడా క్యాన్సిల్‌ చేసుకుంటుండంతో హోటల్‌ పరిశ్రమ విలవిల్లాడుతోంది.

పడకేసిన ట్యాక్సీలు, క్యాబ్‌లు నగరంలో చుట్టుపక్కల ఉండే రామోజీ ఫిల్మ్‌సిటీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్, జూపార్క్, వండర్‌లా, లుంబిని పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్‌ లాంటి పర్యాటక ప్రదేశాలన్నీ మూసి వేయడంతో పర్యాటకుల సంఖ్య జీరోకు వచ్చింది. ఈఎఫెక్ట్‌ కార్లు, ట్యాక్సీల మీద పడింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో కార్లు, ట్యాక్సీ, మినీ బస్సులు సుమారు 150కి పైగా ఉంటాయి. మరికొన్ని వాహనాలు నగరం నుంచి శ్రీశైలం, షిర్డీ, వేములవాడ, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రతిరోజూ వెళ్తుంటాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఒక్క వాహనం కూడా వెళ్లడం లేదు.

ఐటీ కంపెనీల ముందస్తు చర్యలు..
విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులను 14 రోజుల పాటు ఇళ్లకే పరిమితం చేస్తున్నారు.
ఐటీ కంపెనీల్లో వేలి ముద్రతో ఉండే బయోమెట్రిక్‌ హాజరు సిస్టమ్‌ను ఐటీ కార్డుతో పనిచేసే విధంగా మార్చారు.  
ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వస్తే ఫోన్‌లో సమాచారం ఇచ్చి ఇంటి వద్దే ఉండవచ్చు.  
నో షేక్‌ హ్యాండ్, ప్రతిచోట శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచారు.
మేనేజర్లు, టీమ్‌లీడర్లు రోజువారి మీటింగ్‌లు, రివ్యూలు రద్దు చేశారు.  
ల్యాప్‌టాప్‌లు ఉన్న మేనేజర్లు, టీమ్‌ లీడర్లు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారు.
ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌ సమకూర్చేందుకు కొన్ని కంపెనీలు ల్యాప్‌టాప్‌లు ఆర్డర్‌ చేశాయి.
వచ్చే రోజుల్లో కరోనా పరిస్థితిని బట్టి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌కు అవకాశం కల్పించే దిశగా చర్యలు
లిఫ్ట్‌లు, స్టెప్స్, రీలింగ్, కామన్‌ ఏరియా, కేఫ్‌టేరియా, సిస్టమ్స్, టేబుల్స్‌ను నిరంతరం శానిటైజర్స్‌తో శుభ్రం చేస్తున్నారు.  
కొన్ని కంపెనీలు మాత్రమే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నాయి.

అవగాహనతోనే..
ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో ఐటీ కంపెనీలు అప్రమత్తం అయ్యాయనే చెప్పాలి. హైసీయా, ఎస్‌సీఎస్‌సీలు ఐటీ కంపెనీలకు ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాయి. థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు శానిటైజేషన్, వర్క్‌ ఫ్రం హోమ్‌తో తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పాలి. విదేశాల నుంచి ఉద్యోగులను 14 రోజుల పాటు కంపెనీలకు రాకుండా స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు కంపెనీలు అవగాహన కల్పిస్తున్నాయి.  

తినేవారు లేక.. వెలవెల
 కరోనా వైరస్‌ చిరు వ్యాపారుల పొట్టకొడుతోంది. వారం క్రితం వరకు కిటకిటలాడిన మొబైల్‌ లంచ్‌ కేంద్రాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. జనం రాకపోవడంతో ఎక్కడికక్కడ చాలా మంది మూసివేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని షేక్‌పేట మండల కార్యాలయం పక్కన సుశీల అనే వృద్ధురాలు ప్రతిరోజూ 150 మందికి భోజనాలు విక్రయిస్తుంటుంది. 5 రోజుల నుంచి జనం రాకపోవడంతో ఆమెకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఆదివారం నుంచే మెస్‌ మూసివేసింది. ఇది కేవలం సుశీల పరిస్థితి మాత్రమే కాదు. తినడానికి జనం రాకపోవడంతో ఆహార పదార్థాలు పాడవుతున్నాయని, అందుకే మూసివేశామని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లో మొబైల్‌ లంచ్‌ కేంద్రం నడిపే పార్వతి తెలిపారు. ఇక ఇప్పుడిప్పుడే చాలా వరకు చిరు వ్యాపారులు తమ కేంద్రాలకు స్వస్తి పలుకుతున్నారు. రోజురోజుకు కరోనా వైరస్‌పై జాగ్రత్తలు పెరుగుతుండటంతో బయట తిరిగే వారి సంఖ్య తగ్గడం వీరికి శాపంగా మారింది. రోజూ రూ.200 నుంచి రూ.500 వరకు సంపాదించుకునే చిరు వ్యాపారులు ఇప్పుడు పనిలేక తిప్పలు తప్పడం లేదు. ఇంకో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగితే చేసిన అప్పులు కట్టుకోలేక ఇబ్బందులు తప్పవేమోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
సుల్తాన్‌బజార్‌: కరోనా బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఇ. విజయేందర్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ సంజీవ్‌సింగ్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం కోఠిలోని ఐఎంఏ హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా వ్యాపించిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా  1.20లక్షల మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్లు, సబ్బులతో తరచూ చేతులు శుభ్రపరుచుకోవాలని సూచించారు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి నుంచి దూరంగా ఉండాలన్నారు. కరోనా వ్యాధి సోకిన వారు తమను తాము రక్షించుకుంటూ, సమాజాన్ని రక్షించుకోవాలని సూచించారు. జనం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో తిరగరాదని సూచించారు. దీనిపై ప్రజలకు ఎన్జీఓస్, మీడియా ప్రభుత్వం విస్త్రృత ప్రచారం నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఛాతి వైద్య నిపుణులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వం అడిగితే వైద్యులను పంపుతామన్నారు. కరోనా అనుమానితులు పారిపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర కోశాధికారి డాక్టర్‌ శివలింగం, ఉపాధ్యాక్షులు డా. ద్వారకానా«థ్‌రెడ్డి, దిలీప్‌ బానుశాలి, గట్టు శ్రీనివాసులు, అశోక్, సంపత్‌రావు, గిప్ట్‌సన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement