కోవిడ్‌ పరీక్షలు.. ఐసోలేషన్‌ వార్డులో 33 మంది | Sakshi
Sakshi News home page

సత్వరమే..

Published Wed, Mar 11 2020 8:58 AM

COVID 19 Tests in Gandhi Hospital Hyderabad - Sakshi

గాంధీఆస్పత్రి: కోవిడ్‌ అనుమానిత బాధితుల విషయంలో నిర్లక్ష్యం చూపొద్దని, నిర్ధారణ పరీక్షలు వేగవంతంగా పూర్తిచేసి వారికి సత్వర సేవలందించాలని  మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరక్టర్‌ (డీఎంఈ) రమేష్‌రెడ్డి గాంధీ ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీ బోధనాసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. వైరాలజీ ల్యాబ్‌ ఇన్‌చార్జిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైక్రోబయోలజీ ప్రొఫెసర్‌ జ్యోతిలక్ష్మితో పలు అంశాలపై చర్చించారు. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని సూచించారు. గాంధీ ఐసోలేషన్‌ వార్డులో 27 పడకలు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రతిరోజు 35 నుంచి 40 మంది కోవిడ్‌ అనుమానితులు వస్తున్నారు.

వారి నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చేవరకు ఐసోలేషన్‌ వార్డులోనే ఉండాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా పడకలు లేకపోవడంతో కోవిడ్‌ అనుమానితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని, నెగిటివ్‌ వచ్చినవారికి హోం ఐసోలేషన్‌కు సంబంధించిన తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అందించి డిశ్చార్జ్‌ చేయాలని డీఎంఈ సంబంధిత అధికారులకు సూచించారు.  కాగా గాంధీ ఐసోలేషన్‌ వార్డులో మంగళవారం 33 మంది కోవిడ్‌ అనుమానితులు నిర్ధారణ నివేదికలో కోసం నిరీక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 16 మంది అనుమానితులు రాగా, వారిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. సోమవారం వచ్చిన 17 మందికి సంబంధించిన నివేదికలు అందకపోవడంతో  కోవిడ్‌ అనుమానితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫీవర్‌లో మరో కేసు
నల్లకుంట: ఫీవర్‌ ఆసుపత్రిలో మరో అనుమానిత కోవిడ్‌–19 కేసు నమోదైంది. వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు (27) నెల రోజుల క్రితం సింగపూర్‌ నుంచి వచ్చాడు. ప్రపంచ దేశాలను కోవిడ్‌ వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ఆయన మంగళవారం సాయంత్రం ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చాడు. ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అతని నుంచి నమూనాలు సేకరించి గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.

Advertisement
Advertisement