పోలీసు ఖ్యాతిని పెంచాలి | Sakshi
Sakshi News home page

పోలీసు ఖ్యాతిని పెంచాలి

Published Fri, Aug 15 2014 1:31 AM

పోలీసు ఖ్యాతిని పెంచాలి - Sakshi

  • మూడు నెలల్లో నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు  
  •  ఆధునిక ఇంటిగ్రేటెడ్ పోలీసు కమిషనరేట్  
  •  శాంతిభద్రతలు సవ్యంగా ఉంటేనే అభివృద్ధి
  •  
    సాక్షి,హైదరాబాద్: శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పోలీసులు సమర్ధవంతంగా పనిచేసి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునిచ్చారు. పోలీసు శాఖ కోసం కొత్తగా ఖరీదు చేసిన ఇన్నోవా, ద్విచక్ర వాహనాలకు గురువారం ట్యాంక్‌బండ్‌పై ఆయన పచ్చజెండాను ఊపి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసుశాఖను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చే దిశగా పలు చర్యలను చేపడుతున్నామని  తెలిపారు. 
     
    ప్రజలు కూడా పోలీసులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చి శాంతిభద్రతలను కాపాడటంలో సహకరించాలని  విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్‌లోని ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి రిలయన్స్ ముందుకు వచ్చిందని కేసీఆర్ వివరించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోలీసు శాఖ ఉమ్మడిగా పరిస్థితిని చక్కదిద్దాలని తమ పరిధి కాదంటూ నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన సున్నితంగా హెచ్చరించారు.
     
    హైదరాబాద్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  బంజారాహిల్స్‌లో పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను నిర్మించబోతున్నామని కేసిఆర్ వెల్లడించారు. అమెరికాలోని మ్యాన్‌హటన్‌లో మాదిరిగా కాలనీలు, అపార్ట్‌మెంట్లలో సైతం ఫ్లాట్‌ల యాజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో  నేరాలు గణనీయంగా తగ్గుతాయని , ఈ దిశగా అడ్మినిస్ట్రేటీవ్ స్టాప్ కాలేజీ కార్యాచరణను  రూపొందించనుందని ఆయన అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల లాంటి ఘటనలు ఒక్కటి కూడా ఇక ముందు  చోటు చేసుకోరాదని ఆ దిశగా పోలీసు యంత్రాంగాన్ని పటిష్టపరచాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. 
     
    పోలీసుశాఖకు 1810 ఇన్నోవాలు, 2600 ద్విచక్ర వాహనాలను అన్ని సౌకర్యాలతో ఖరీదు చేస్తున్నామని , ఇందులో తొలి విడతగా వచ్చిన వాహనాలను హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సత్యనారాయణ, మేయర్ మాజిద్ హుస్సేన్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 
     
     ప్రారంభించిన కొద్దిసేపటికే ప్రమాదం
     పోలీసు వాహనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన కొద్దిసేపటికే ట్యాంక్‌బండ్‌పై ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇన్నోవా ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. సీఎం వాహనాల ట్రయల్ రన్ ప్రారంభించగా ఒకదాని వెంట ఒకటి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయంపై గాంధీనగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి ప్రమాదం జరుగలేదని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement