లోక్‌సభ బరిలో నేర చరితులు! | Sakshi
Sakshi News home page

లోక్‌సభ బరిలో నేర చరితులు!

Published Fri, Mar 29 2019 12:40 AM

Criminal history in the Lok Sabha members - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నేర చరిత్రను కలిగి ఉన్నారు. పెద్దపల్లి, మెదక్, చేవెళ్ల, వరంగల్‌ స్థానాలకు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులెవరికీ ఎలాంటి నేర చరిత్ర లేదు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలన్నింటిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 8 మంది కాంగ్రెస్, చెరో 5 మంది టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ సైతం కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించింది. 

కొన్ని ముఖ్యమైన కేసులు 
►ఆదిలాబాద్‌ నియోజకవర్గంనుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సోయం బాçపూరావుపై 52 కేసులు పెండింగ్‌లో ఉండగా, అందులో ఓ కేసు తీవ్రమైన నేరారోపణ కలిగినది. మోసం, ఫోర్జరీ, పాస్‌పోర్టులో తన భార్యకు బదులుగా మరో మహిళను చూపించడం వంటి ఆరోపణలపై 2007లో ఆయనపై ఈ కేసు నమోదైంది. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది.  
► ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వర్‌రావుపై 5 కేసులున్నాయి. అన్నీ కూడా తీవ్ర నేరారోపణలతో కూడిన కేసులే. అత్యాచారం, వివాహేతర సంబంధం, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం, మోసం, హవాలా డబ్బు వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు.  
► హైదరాబాద్‌ నుంచి ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న అసదుద్దీన్‌ ఒవైసీపై బిహార్, మహారాష్ట్ర, తెలంగాణలో 5 కేసులున్నాయి. ఒక కేసు 9 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది.  
►మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన ఎ.రేవంత్‌రెడ్డిపై 42 కేసులున్నాయి.  

నేర చరితులకు టికెట్లు ఎలా ఇస్తారు: పద్మనాభ రెడ్డి
అఫిడవిట్‌లోని సెక్షన్‌ 6(ఏ) ప్రకారం ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసులు, వాటి పూర్తి వివరాలను సంబంధిత పార్టీకి తెలపాల్సి ఉం టుంది. పైన తెలిపిన అభ్యర్థులు తమ నేర చరిత్రను తెలియజేసినా ఆయా రాజకీయ పార్టీలు వారికి బీ ఫారం ఇవ్వడం సరికాదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గెలుపు గుర్రాలను ఎంచుకోవడం కోసం నేర చరిత్ర గల అభ్యర్థులను పార్టీలు ఎంపిక చేశాయని తప్పుబట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను తొందరగా పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యా యని తెలిపారు. రాష్ట్రంలో 2018 ఫిబ్రవరి 2న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు జీవో ఇచ్చారని,   న్యాయాధిపతిని, తగిన సిబ్బందిని కేటాయించకపోవడం, మరో జడ్జికి అదనపు బాధ్యతలు అప్పగించడం, వివిధ జిల్లా ల కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయడంలో ఆలస్యం వల్ల కేసుల విచారణ తొందరగా పూర్తి కావడం లేదన్నారు. నేరచరితులకు  టికెట్లు కేటాయించడం, న్యాయవ్యవస్థలో విపరీత జాప్యంతో నేరచరితులు చట్ట సభల్లో ప్రవేశిస్తున్నారన్నారు. 

Advertisement
Advertisement