Sakshi News home page

వడ్డీ వెనక్కి ఇప్పిస్తాం

Published Sat, Sep 5 2015 3:49 AM

crop loan bank intrest to be back says pocharam

రైతులకు మంత్రులు ఈటల, పోచారం హామీ
 సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలలోపు పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తే వెనక్కి ఇప్పిస్తామని మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. పంట రుణాలపై కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీకి తోడు 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని... ఈ వడ్డీని రైతుల నుంచి వసూలు చేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వారు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో బ్యాంకర్ల కమిటీ భేటీ అనంతరం ఈటల, పోచారం మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు 80 శాతం పంట రుణాలు పంపిణీ చేయాలని తీర్మానం చేశామని, దీని పురోగతిపై ప్రతి వారం నివేదికలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ఏడాది మొత్తం పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.25వేల కోట్లు కాగా.. ఖరీఫ్ లక్ష్యం రూ.18వేల కోట్లు అని, ఇందులో ఇప్పటివరకు రూ.7 వేల కోట్ల పంపిణీ జరిగిందని తెలిపారు. రుణమాఫీ పొందిన 35 లక్షల మందిలో 16 లక్షల మంది రైతులు తమ రుణాలు రెన్యువల్ చేసుకున్నట్లు చెప్పారు.

రుణ మాఫీ పొందిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగం తరఫున రుణమాఫీ పత్రాలను అందజేసిందని... అదే తరహాలో రుణ విముక్తి పొందినట్లు ధ్రువీకరిస్తూ బ్యాంకుల నుంచి అనెక్సర్-ఎఫ్ పత్రాన్ని జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి మరింత ఆస్కారమున్నట్లుగా గుర్తించిన బ్యాంకర్లు ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళికను రూ.72,112 కోట్ల నుంచి రూ.78,776 కోట్లకు పెంచారని మంత్రి ఈటల చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని... రుణాల మంజూరుకే కాకుం డా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కోరారు. వర్షాధారంపై వరి నాట్లు వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారని... రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన వైపు బ్యాంకర్లు దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమలను ప్రోత్సాహించేం దుకు ప్రభుత్వం చేపడుతున్న సింగిల్ విండో విధానం, రాయితీలకు తోడుగా బ్యాంకర్లు సైతం రుణసాయం అందించాలని, అవసరమైతే రీ ఫైనాన్స్ చేయాలని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement