కన్నుల పండువగా ‘సాంస్కృతికోత్సవాలు’ | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా ‘సాంస్కృతికోత్సవాలు’

Published Wed, Dec 13 2017 2:31 AM

Cultural activities in telugu mahasabhalu  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘సాంస్కృతికోత్సవాల’కు పెద్దపీట వేశారు. ప్రతినిధులు, ఆహూతులందరూ ఒకేచోట కూర్చొని మహాసభలను వీక్షించేందుకు అనువుగా అన్ని కార్యక్రమాలను ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం వద్దకు మార్చారు. దీంతో రవీంద్రభారతిలో ప్రతి రోజు నిర్వహించ తలపెట్టిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, తెలుగు లలిత కళాతోరణంలో నాలుగు రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపాదిం చిన వివిధ జిల్లాలకు చెందిన జానపద కళారూపాల ప్రదర్శనలు రద్దయ్యాయి.

తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర ప్రధాన అంశాలుగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలను పరిమితం చేసి ఎల్బీ స్టేడియంకు మార్చినట్లు మహాసభలను పర్యవేక్షిస్తున్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. మూడు చోట్ల నిర్వహించడం వల్ల ఎక్కువ మంది వేడుకల్లో పాల్గొనే అవకాశంఉండదనే ఉద్దేశంతో కూడా మార్పు అనివార్యమైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న మహాసభల ఆరంభం నుంచి 18వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికపైనే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు సాహిత్య సదస్సు ఉంటుంది. ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం లేదు.

వందేమాతరం శ్రీనివాస్‌ గీతంతో..
మహాసభలు ప్రారంభం రోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు వందేమాతరం శ్రీనివాస్‌ గీతంతో ఆరంభమవుతాయి. మహాసభల ప్రాశస్త్యంపై ఈ గీతాన్ని రూపొందించారు. ఆ తర్వాత రాధారెడ్డి, రాజారెడ్డి ‘మన తెలంగాణ’ నృత్య రూపక ప్రదర్శన ఉంటుంది. అనంతరం ‘లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీ’ ఆధ్వర్యంలో రామాచారి బృందం తెలుగు పద్యాలు, గీతాల ఆలాపన, దేశిపతి శ్రీనివాస్‌ రూపొందించిన నృత్యరూపకం ‘జయ జయస్తు తెలంగాణ’ తదితర కార్యక్రమాలు ఉంటాయి.

16వ తేదీ రెండో రోజు హైదరాబాద్‌ బ్రదర్స్‌ రాఘవాచారి, శేషాచారి శత గళాసంకీర్తన, రామదాసు కీర్తనలు, అంతర్జాతీయ మూకాభినయ కళాకారుడు మైమ్‌ మధు ప్రదర్శన ఉంటాయి. వింజమూరి రాగసుధ కూచిపూడి నృత్య ప్రదర్శన, కాలిఫోర్నియాలో ఉంటున్న కళాకారిణి షిర్నికాంత్‌ ప్రదర్శన, డాక్టర్‌ అలేఖ్య పుంజాల ‘రాణీరుద్రమ దేవి’నృత్య రూప ప్రదర్శన ఉంటాయి.
17వ తేదీ మూడో రోజు రసమయి బాలకిషన్‌ సారథ్యంలో జానపద విభావరి ఉంటుంది. లక్నోలో ఉంటున్న కళా మీనాక్షి, ముంబైకి చెందిన నృత్య కళాంజలి జానపద ప్రదర్శనలు ఉంటాయి. మంగళ, రాఘవరాజు భట్ల జానపద నృత్య ప్రదర్శన ఉంటుంది.
18వ తేదీ నాలుగో రోజు కార్యక్రమాల్లో మలేషియా తెలుగువారి కదంబ కార్యక్రమం, ప్రముఖ నటీనటులు, సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పాల్గొనే సినీ సంగీత విభావరి ఉంటుంది. ప్రతి రోజు కార్యక్రమాల ఆరంభానికి ముందు అరగంట పాటు ‘తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యం’పై సినిమా ప్రదర్శన ఉంటుంది.


వేదికల మార్పు..
రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్ర మాలు రద్దయిన దృష్ట్యా ప్రధాన ఆడిటోరియంలో బాలలు, మహిళల సాహిత్యం, ప్రవాస తెలుగువారి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలో అష్టావధానం ఉంటుంది.
 పబ్లిక్‌గార్డెన్స్‌ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్‌కవి సమ్మేళనం నిర్వహిస్తారు.
తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌లో శతావధానం ఉంటుంది.

Advertisement
Advertisement