దళితుల భూ పంపిణీకి బ్రేక్! | Sakshi
Sakshi News home page

దళితుల భూ పంపిణీకి బ్రేక్!

Published Sun, Aug 17 2014 10:27 PM

Dalit land distribution Postponed !

అమలులోకి ఎన్నికల  కోడ్
నర్సాపూర్: ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి దళితుల భూ పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడే దళితులకు భూ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ ఒక్క మండలంలో  భూ పంపిణీ చేపట్టలేదు. భూములను గుర్తించి కొనుగోలు చేసేందుకు  సిద్ధమైనా, నిధులు విడుదల కాకపోవడంతో  పంపిణీ జరగలేదు. కొన్ని మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానందున పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా మెదక్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు కమిషన్  నిర్ణయం తీసుకున్నందున ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు భూ పంపిణీ జరిగే అవకాశాలు లేవు.

దీంతో ఎంపికైనా లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.  నర్సాపూర్ మండలంలోని మూసాపేటలో 19 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, 57ఎకరాల భూములను గుర్తించి కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేపట్టినా కొనుగోలు ప్రక్రియ వాయిదా పడింది.  ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పాటు,  గుర్తించిన భూమికి చెందిన ఒక పట్టేదారు అందుబాటులో లేకపోవడం మరో కారణమని తెలిసింది. గుర్తించిన భూములను స్థానిక తహశీల్దార్ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను సైతం గుర్తించి కేటాయించారు.  కాగా లబ్దిదారులను, భూములు గుర్తించేందుకు స్థానిక అధికారులు, నాయకులు ఎంతగానో శ్రమించారు.
 
కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో ఇద్దరు భూమిలేని లబ్ధిదారులను గుర్తించినప్పటికీ భూమి కొనుగోలులో జాప్యం జరగడంతో పంపిణీ కార్యక్రమంలో జరగులేదు. శివ్వంపేట మండలంలోని రత్నాపూర్‌లో భూములు పంపిణీ చేయాలని నిర్ణయించినా భూముల కొనుగోలు చేపట్టనందున పంపిణీ జరగలేదు.  హత్నూర మండలం కొన్యాలలో భూములు పంపిణీ చేపట్టాలని యోచించినా లబ్ధిదారుల గుర్తింపు జరగలేదు.  వెల్దుర్తి మండలంలో రామంతాపూర్, ఉప్పులింగాపూర్ గ్రామాల్లో ఏదో ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించగా రెండు గ్రామాల్లో భూములు దొరికే పరిస్థితులు లేకపోవడంతో మండలంలో భూ పంపిణీ ఆదిలోనే ఆగిపోయింది. కౌడిపల్లి మండలంలోని శిలాంపల్లిలో లబ్ధిదారులను గుర్తించినా భూముల కొనుగోలు ప్రక్రియ పూర్తి కానందున ఎవరికి భూములు పంపిణీ చేయలేదు.
 
ఎన్నికల కోడ్ అమలులో ఉంది
ఉప ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నందున పంపిణీ విషయం ఇప్పుడేమీ చెప్పలేమని  స్థానిక తహశీల్దార్ అన్వర్ మహమ్మద్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కార్యక్రమం చేపడతామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement