పద్ధతి మార్చుకోకపోతే జైలుకే... | Sakshi
Sakshi News home page

పద్ధతి మార్చుకోకపోతే జైలుకే...

Published Tue, Jan 13 2015 8:22 AM

dcp ramarajeswari warns to eve teesars

ఈవ్‌టీజర్లకు డీసీపీ రమారాజేశ్వరి హెచ్చరిక
11 మంది ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్

హైదరాబాద్: షీ-టీమ్స్‌కు పట్టుబడిన ఈవ్‌టీజర్లు కౌన్సెలింగ్ తర్వాత తమ పద్ధతి మార్చుకోకపోతే వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని మల్కాజిగిరి డీసీపీ, షీ-టీమ్స్ నోడల్ అధికారి రమారాజేశ్వరి హెచ్చరించారు. సోమవారం 11 మంది ఈవ్‌టీజర్లను అరెస్టు చేసిన సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమినరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షీ-టీమ్స్ పని తీరును ఆమె వివరించారు. కేపీహెచ్‌బీ, ఉప్పల్, జీడిమెట్ల ప్రాంతాలలో ఈవ్‌టీజింగ్ ఎక్కువగా ఉందన్నారు. సైబరాబాద్‌లో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు గతనెల 24న 60 షీ-టీమ్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు ఈస్ట్‌జోన్‌లో 5, వెస్ట్‌జోన్‌లో 11 ప్రాంతాలల్లో  45 మంది పట్టుబడ్డారన్నారు. వీరంద రిపై సిటీ పోలీసు యాక్ట్ కింద కేసు నమోదు చేసి క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్ (కావ్) సెల్‌లో నిపుణులతో వారి కుటుంబ సభ్యుల ముందే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. వీరు తమ పద్ధతి మార్చుకుని మంచిగా ఉంటే సరేనని, మరోసారి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే మాత్రం ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు.

ముఖ్యంగా ఐటీ జోన్ అయిన మాదాపూర్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, మియాపూర్, చందానగర్‌లలో 10 షీ-టీమ్స్ తిరుగుతున్నాయన్నారు. బస్టాపులు, షాపింగ్ మాల్స్, హాస్టళ్లు, సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్ల వద్ద ఈవ్‌టీజింగ్‌పై గట్టి నిఘా వేశామన్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిని సాక్ష్యాలతో సహా వీడియో తీస్తున్నామన్నారు.  మహిళా కానిస్టేబుళ్లతో డెకాయి ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈవ్‌టీజింగ్‌ను ఎదుర్కొన్న బాధితులు 100 డయల్‌కు ఫోన్ చేస్తే.. పది నిమిషాల్లోనే షీ-టీమ్ అక్కడికి చేరుకొని పోకిరీల భరతం పడుతుందన్నారు.  సమావేశంలో క్రైమ్స్ ఏసీపీ ఉష, సైబర్‌క్రైమ్స్ ఏసీపీ స్నేహిత పాల్గొన్నారు. తాజాగా పట్టుబడిన ఈవ్‌టీజర్లు షీ-టీమ్స్ ప్రచారంలో పాలు పంచుకుంటారని చెప్పారు. కళాశాలకు వెళ్లి ఈవ్‌టీజింగ్ దుష్ఫలితాలపై వివరిస్తారన్నారు.  షీ-టీమ్స్ మహిళా కానిస్టేబుళ్లు విలేకరుల సమావేశానికి ‘షీ-టీమ్స్ సైబరాబాద్’ మాస్క్‌ను ధరించి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement