ఇది మా భూమి | Sakshi
Sakshi News home page

ఇది మా భూమి

Published Wed, Aug 6 2014 1:25 AM

ఇది మా భూమి

* పంద్రాగస్టు వేడుకలను ఇక్కడ నిర్వహించొద్దు
* రెవెన్యూ సిబ్బందికి డిఫెన్స్ హెచ్చరిక
* మోహరించిన సైనికులు, పోలీసులు
* గోల్కొండ కోట వద్ద గడబిడ
* నేడు కలెక్టర్ వద్ద పంచాయితీ
 
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇదంతా డిఫెన్స్‌కు చెందిన స్థలం. ఈ స్థలంలో ఎవరైనా కాలు మోపితే ఊరుకోం’ అంటూ... సైనిక విభాగానికి చెందిన  అధికారులు రెవెన్యూ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం గోల్కొండ కోట వద్ద జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని కుదిపేసింది. కోట దిగువన ఉన్న ఖాళీ ప్రదేశం వద్దకు వందలాది మంది సైనికులు చేరుకున్నారు. అది డిఫెన్స్‌కు చెందిన స్థలంగా బోర్డును కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, డిఫెన్స్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారనుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు భారీగా మోహరించారు. ఈలోగా అక్కడికి చేరుకున్న రెవెన్యూ ఉన్నతాధికారులు, మిలిటరీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. స్థలానికి సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను తీసుకొని నేడు జిల్లా కలెక్టర్ వద్దకు పంచాయితీకి రావాలని సూచించారు. డిఫెన్స్ అధికారులు కూడా అందుకు అంగీకరించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఖాళీ ప్రదేశంలో డిఫెన్స్ అధికారులు పెట్టిన బోర్డును రెవెన్యూ అధికారులు పీకేశారు.
 
పరేడ్ పరేషాన్
పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోట వద్ద నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ సంఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది.  గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరణకు ఏ ఇబ్బందులూ లేకున్నా ఈ సందర్భంగా నిర్వహించనున్న పోలీసు పరేడ్‌తోనే సమస్యలు చుట్టుముట్టాయి. పరేడ్ కోసం కోట వెనుక భాగాన 244, 245, 246 సర్వే నంబర్లలో ఉన్న 51 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసిన అధికారులు మంగళవారం సాయంత్రం వరకు సర్వే నిర్వహించారు.

అనంతరం ఆ స్థలం తమదంటూ డిఫెన్స్ అధికారులు సీన్‌లోకి వచ్చారు. ముందస్తుగా ప్రభుత్వం డిఫెన్స్ అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఉంటే ఈ సంఘటన చోటుచేసుకునేది కాదని మిలిటరీ ఆధీనంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌లో ఏటా ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించడం పరిపాటేననీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గోల్కొండ ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్నందున ఆ విభాగం నుంచి అనుమతి కోరుతూ టీ సర్కారు ఓ లేఖ రాసింది. అలాగే డిఫెన్స్‌వారినీ అనుమతి కోరనుంది.

Advertisement
Advertisement