భారీ పెనాల్టీల అమలులో జాప్యం? | Sakshi
Sakshi News home page

భారీ పెనాల్టీల అమలులో జాప్యం?

Published Sun, Sep 1 2019 4:07 AM

Delay in Implementation of Heavy Penalties - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమిస్తే అతి భారీ పెనాల్టీలు విధించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేయడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న పెనాల్టీలను ఏకంగా పది రెట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. సెపె్టంబర్‌ ఒకటి నుంచి కొత్త పెనాల్టీలు అమలులోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పునరాలోచనలో పడింది. ఒకేసారి ఏకంగా పది రెట్లకు పెనాల్టీలు పెంచటం సబబు కాదన్న అభిప్రాయంతో ఉంది. ఆదివారం నుంచే అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ శనివారం రాత్రి వరకు ఉత్తర్వు విడుదల కాలేదు.  

శనివారం సాయంత్రం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ రవాణా శాఖ అధికారులతో భేటీ అయ్యారు. కొత్త పెనాల్టీల సర్క్యులర్‌ను అధికారులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అతి భారీ పెనాల్టీల పర్యవసానాలపై వారు చర్చించారు. సమావేశం నుంచే ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలోని అంశాలకు కొన్ని సవరణలు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సునీల్‌శర్మ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. వెరసి ఆదివారం నుంచి ఇవి అమలులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.  

Advertisement
Advertisement