అంగుళమూ వదలొద్దు! | Sakshi
Sakshi News home page

అంగుళమూ వదలొద్దు!

Published Tue, Jun 24 2014 1:24 AM

అంగుళమూ వదలొద్దు! - Sakshi

‘గురుకులం’ అక్రమ నిర్మాణాలపై టీ-సర్కారు చర్యలు


 సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలోని గురుకుల ట్రస్ట్ భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటితో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గురుకుల ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవ సరమైతే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కూడా స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)తో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. గ్రేటర్‌లో వెలిసిన అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.

 

వందలాది ఎకరాల గురుకుల భూములను కబ్జా చేసి అనధికారికంగా నిర్మించిన భవనాలకు కరెంటు, నీటి కనెక్షన్లు ఇవ్వడమేంటని, అది నిబంధనలకు విరుద్ధం కాదా? అని అధికారులను ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు సౌకర్యాలు కల్పించడాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. గురుకుల ట్రస్టు భూముల్లో అంగుళం అన్యాక్రాంతమైనా ఊరుకునేది లేదన్నారు. ఈ భూముల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందన్నారు.
 
 అనధికారికంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసే సందర్భంలో పోలీసుల సాయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్న నిర్మాణాల్లో ఏవైనా ఉల్లంఘనలు ఉంటే నోటీసులు జారీ చేసి, వాటిని సవరించుకునేలా చూడాలని అదేశించారు. అనుమతి లేని నిర్మాణాలకు ఎలాంటి  ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటిని కూల్చేయాలని స్పష్టం చేశారు. గురుకుల ట్రస్టు భూముల్లోనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తప్పవని, ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని కేసీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.  
 
 రంగంలోకి దిగిన అధికారులు
 
 అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాల వివరాలను ఆగమేఘాల మీద ఆరా తీసి కూల్చివేతలు కూడా చేపట్టారు. ట్రస్ట్ భూముల్లో వెలిసిన కాలనీల్లో ఒకటైన అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్‌ను, మరో భవనంపై పిల్లర్లను సోమవారం ధ్వంసం చేశారు. దీంతో అయ్యప్ప సొసైటీలోని భవన యజమానుల గుండెల్లో దడ మొదలైంది.  ఏ క్షణాన తమ భవనంపైకి వచ్చి పడతారోనని తీవ్ర ఆందోళనకు గుర వుతున్నారు. మరోవైపు మంగళవారం నాడు భారీ ఎత్తున కూల్చివేతలకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో సొసైటీ సభ్యులు అత్యసవరంగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై యజమానులు చర్చించుకున్నారు.
 
 చర్యలు తీసుకుంటాం
 
 గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. గత మూడేళ్లలో అక్రమంగా వెలసిన భవనాలనుగుర్తించి కూల్చివేతలు జరుపుతాం. తిరిగి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు ఇరవైనాలుగు గంటలూ నిఘా ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మూడు బృందాలను షిఫ్టుల ప్రకారం విధుల్లో ఉంచుతాం. రాత్రి వేళ నిర్మాణాలు జరిగినా గుర్తించి చర్యలు తీసుకుంటాం.
 - సోమేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్

 

 వీఐపీలెందరో..!
 
 ట్రస్ట్ భూముల్లో భవనాలున్న వారు సామాన్యులేమీ కాదు. అంతా ప్రముఖులే! రాజకీయ, సినీ రంగాలకు చెందిన వారితోపాటు జీహెచ్‌ఎంసీలోని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఉన్నతాధికారులకు సైతం ఇక్కడి సొసైటీల్లో భవనాలున్నాయి. చాలా వరకు బినామీ పేర్లతో ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్‌లకూ ఇక్కడ ఆస్తులున్నట్లు వినిపిస్తుంటుంది. ట్రస్టులో భూముల విలువ ప్రస్తుతం గజానికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంది. సైబర్ టవర్ ముందు నుంచి రైల్వే ట్రాక్ వరకూ విస్తరించి ఉన్న వందల ఎకరాల్లో ఇప్పటికీ క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.
 

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement