రాష్ట్రంలో డెంగీ ఎమర్జెన్సీ! | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో డెంగీ ఎమర్జెన్సీ!

Published Wed, Sep 4 2019 7:11 AM

Dengue Fever Cases Increased In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగీ సోకడంతో రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 50 మంది వరకు మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది. అయితే ఈ మరణాల సంఖ్యను వెల్లడించకుండా అధికారులు దాచిపెడుతున్నారు. తెలంగాణ చరిత్రలో ఇంతమంది డెంగీకి చనిపోయిన పరిస్థితి గతంలో లేనేలేదు. 2017లో మరణాలు సంభవించలేదు. 2018లో ఐదుగురు చనిపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐదేళ్ల వయసు చిన్నారులు మృత్యువాత పడటంపైనా ఆందోళన వ్యక్తం అవుతోంది. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రెండ్రోజులుగా వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ సుదీర్ఘ సమీక్షల్లో మునిగిపోయారు. మంగళవారం ఫీవర్‌ ఆసుపత్రి సందర్శించారు. డెంగీపై ఏం చేయాలన్న దానిపై వైద్యాధికారులతో చర్చలు జరిపారు. 

ప్రైవేటులోనూ ఉచిత పరీక్షలు.. 
డెంగీ మరణాలు అధికంగా నమోదు కావడంతో  ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవిస్తున్న మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సరైన వైద్యం అందించాలని ప్రైవేటు ఆసుపత్రులను సర్కారు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే బోధనాసుపత్రులు, ఫీవర్‌ ఆసుపత్రి, ఐపీఎం కేంద్రాల్లో ప్రజలకు ఉచిత డెంగీ పరీక్షలు నిర్వహిస్తుండగా, ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లలోనూ ఉచితంగా పరీక్షలు చేసేందుకు కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 

ఉచిత హోమియో మందు.. 
డెంగీ జ్వరాలు రాకుండా ఉచిత హోమియో మందు సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆయుష్‌ విభాగం ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని హోమియో కాలేజీలో, ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్ల వద్ద ఉచిత హోమియో మందులు సరఫరా చేయనున్నారు. అందుకు తక్షణమే 3 లక్షల డోసుల డెంగీ నివారణ మందు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డెంగీ నివారణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. 

ప్రత్యేక వార్డులు.. 
ఏరియా, జిల్లా ఆసుపత్రులు, నిలోఫర్, గాంధీ, ఉస్మానియా వంటి అన్ని బోధనాసుపత్రుల్లోనూ డెంగీ జ్వరాలతో వచ్చే వారికి ప్రత్యేక వార్డులు కేటాయిస్తారు. ప్రతి ఆసుపత్రిలో దాదాపు 20 పడకలు డెంగీ బాధితుల కోసం కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే వైద్యులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేశారు. సెలవులు, ఆదివారాల్లోనూ ఉదయం సాయంత్రం ఓపీ సేవలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 600 వైద్య శిబిరాలు నిర్వహించారు. ములుగు, భద్రాద్రి, హైదరాబాద్‌ జిల్లాలో మలేరియా, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్‌ అర్బన్, మేడ్చల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ జిల్లాలో డెంగీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతో వాటిని హైరిస్క్‌ జిల్లాలుగా ప్రకటించారు.

Advertisement
Advertisement