డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి

Published Fri, Jun 13 2014 1:19 AM

డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే ఆమె డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం సభ్యులు ఆమెను సాదరంగా స్పీకర్ పీఠం వద్దకు తీసుకెళ్లి కూర్చొబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పద్మా దేవేందర్‌రెడ్డి పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఆమెను తన బిడ్డగా సంబోధిస్తూ తమ జిల్లా వాసి డిప్యూటీ స్పీకర్ అవడం ఆనందంగా ఉందన్నారు. న్యాయవాదిగా రంగారెడ్డి జిల్లా కోర్టు, హైకోర్టులో పని చేశారని, అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి సేవలు అందించారని పేర్కొన్నారు. ఇతర పార్టీల వారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇమ్మని కోరారని, అయితే అప్పటికే నిర్ణయం జరిగినందున మనసు నొచ్చుకోవద్దని చెప్పానన్నారు. రెండు మూడు రోజుల ముందుగా అడిగితే బాగుండేదని పేర్కొన్నారు.

విపక్షాలకు ఇవ్వకపోయినా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త రాష్ట్రమైనా అంతా హుందాగా సహకరించారన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మాట్లాడుతూ ప్రజలు గర్వించేలా హుందాగా సభను నడుపుతారనే నమ్మకం తమకు ఉందన్నారు. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో పద్మాదేవేందర్‌రెడ్డి క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అందరికీ ఆడబిడ్డగా ఉద్యమాల్లో కీలంగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ నిర్వహించిన పాదయాత్ర, సైకిల్ యాత్రల్లో పాల్గొన్నారన్నారు. కాంగ్రెస్ సీనియర్ సభ్యురాలు జె.గీతారెడ్డి మాట్లాడుతూ మహిళల సమస్యలపై ఒక మహిళగా డిప్యూటీ స్పీకర్ ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. తొలి అసెంబ్లీలో మహిళా డిప్యూటీ స్పీకర్‌గా చరిత్ర పుటల్లోకి వెళతారన్నారు. టీడీపీ సభ్యుడు వివేకానంద మాట్లాడుతూ పద్మా దేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందున తమను మాటల్తో అడ్డుకునే ఒక వికెట్ పడిపోయిందని చమత్కరించారు. బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళకు అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు. అయితే ఆమె ఈ సీట్లోకంటే ఆ సీట్లో కూర్చుంటే బాగుండేదని సీఎం సీటును చూపిస్తూ పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, వివిధ పార్టీల సభ్యులు డీకే అరుణ, సున్నం రాజయ్య, సునీత, కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రెడ్యానాయక్, రవీంద్రకుమార్ మాట్లాడారు.

ప్రజల దృష్టి మన సభపైనే: పద్మా దేవేందర్‌రెడ్డి

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 60 ఏళ్ల కల సాకారమైందని, ప్రజల దృష్టి రాష్ట్ర పునర్నిర్మాణంపై, అందుకు సభ చేసే నిర్ణయాలపై ఉంటుందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన నిర్ణయాలు ఉండాలన్నారు. సద్విమర్శలతో పరస్పర సహకారంతో ముందుకు సాగుదామన్నారు. సభా హక్కులకు, సంప్రదాయాలకు భంగం కలగకుండా 29వ రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శంగా ఉండాలన్నారు. సభ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానన్నారు

Advertisement
Advertisement