Sakshi News home page

శిక్షా శాతం పెరిగేలా పనిచేయాలి

Published Sun, Jun 24 2018 1:26 AM

DGP Mahendar Reddy at the court constables conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేరస్తులకు పడే శిక్షా శాతం పెరిగేలా కోర్టు కానిస్టేబుళ్లు, దర్యాప్తు అధికారులు కృషి చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. దేశవ్యాప్తంగా కన్విక్షన్‌ రేటు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో శిక్షా శాతం పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన అంశాలపై హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సదస్సుకు అన్ని పోలీస్‌స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ సాక్షులకు పోలీస్‌ శాఖ, కోర్టులపై నమ్మకం కల్గించేలా పనిచేయాలన్నారు. సమాజం తరఫున బాధ్యత తీసుకుని నేరçస్తులకు శిక్షపడేలా, బాధితులకు న్యాయం దక్కేలా కృషి చేయాలని చెప్పారు.

దర్యాప్తు అధికారులు కేసుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, బాధిత కుటుంబాలకు కేసుల విచారణ, పురోగతిపై వివరాలందించాలన్నారు. అంకితభావంతో పనిచేసే కానిస్టేబుళ్లకు రివార్డుతో పాటు గుర్తింపు లభిస్తుందని వెల్లడించారు. నేరస్తులకు శిక్షపడేలా పనిచేసిన కోర్టు కానిస్టేబుళ్లను సంబంధిత అధికారులు అభినందించాలన్నారు. కేసుల విచారణలో డిఫెన్స్‌ను ఎదుర్కునేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. దీని ద్వారా నేరం చేసిన ప్రతీ వ్యక్తికి శిక్షపడుతుందని ఆకాక్షించారు. కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్, కమిషనర్లు అంజనీకుమార్, సజ్జన్నార్, డీవోపీ వైజయంతి, ఎస్పీలు, ఇతర కమిషనర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement