పోలీసుల నిర్లక్ష్యానికి.. నిందితుడు బలి | Sakshi
Sakshi News home page

పోలీసుల నిర్లక్ష్యానికి.. నిందితుడు బలి

Published Tue, Jun 24 2014 2:58 AM

పోలీసుల నిర్లక్ష్యానికి..  నిందితుడు బలి - Sakshi

ఠాణా నుంచి పారిపోబోతే.. ప్రాణమే పోయింది
 
భార్యపై హత్యాయత్నం కేసులో అదుపులోకి..
మూడు రోజులు కస్టడీలోనే.. కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటన
సీఐ, ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్ సస్పెన్షన్

 
కరీంనగర్ రూరల్ పోలీసుల నిర్లక్ష్యం కస్టడీలో ఉన్న నిందితుడి మృతికి కారణమైంది. భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో ముత్తారం మండలం పారుపెల్లికి చెందిన యాట రమేష్(35)ను పోలీసులు ఈ నెల 20న అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరం ఒప్పుకున్నప్పటికీ 24 గంటల్లోగా కోర్టులో హాజరుపర్చకుండా తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. దీంతో రమేష్ సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి మృత్యువాతపడ్డాడు. ఠాణా గోడ దూకి బయటపడాలనుకుంటే.. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో కరెంటు షాక్‌కు గురై మరణించాడు. ఈ సంఘటనకు బాధ్యులైన కరీంనగర్ రూరల్ సీఐ డి.కమలాకర్‌రెడ్డి, ఎస్సైలు కె.సృజన్‌రెడ్డి, డి.ఆంజనేయులు, త్రీటౌన్ కానిస్టేబుల్ కె.శ్రీనివాస్‌లను ఎస్పీ శివకుమార్     సస్పెండ్ చేశారు.   - కరీంనగర్ క్రైం                      
 
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన యాట రమేష్ పద్నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం మంథనికి వచ్చాడు. వచ్చిన రెండేళ్లకు ముత్తారం మండలం పారుపెల్లికి చెందిన సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి అక్కడే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొద్దిరోజుల నుంచి రమేష్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గ్రామంలో పనిలేక పదిరోజుల క్రితం కరీంనగర్ మండలం శ్రీరాములపల్లిలోని కోళ్లఫారంలో పనిలో చేరాడు. కుటుంబంతో సహా వచ్చి శ్రీరాములపల్లికి దగ్గరలోని కమాన్‌పూర్‌లో నివాసముంటున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఆయన తరచూ ఆమెను చితకబాదుతున్నాడు. ఈనెల 18న రాత్రి నిద్రపోతున్న సమ్మక్కపై హత్యాయత్నం చేశాడు. కత్తితో గొంతు కోసి పారిపోయాడు. గాయపడ్డ సమ్మక్కను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ప్రాణాపాయం తప్పడంతో రమేష్‌పై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఈనెల 20న మంథని సమీపంలో అతడిని అదుపులోకి తీసుకుని కస్టడీలో ఉంచుకున్నట్టు సమాచారం.

ఆలస్యంగా రిమాండ్‌కు..!

మూడు రోజుల క్రితం రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 24 గంటల్లోపు అతడిని కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా జాప్యం చేశారు. సోమవారం రిమాండ్‌కు తరలించేందుకు ఎస్సై సృజన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఉదయం 8గంటలకు నిందితుడిని కాలకృత్యాలు తీర్చుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. రమేష్ ముఖం కడుక్కుంటానని చెప్పడంతో ఎస్సై అతడికి రక్షణగా శ్రీనివాస్ అనే కానిస్టేబుల్‌ను పంపించారు. రూరల్ సీఐ కార్యాలయం పక్కనే ముఖం కడుక్కున్నట్లు నటించిన రమేష్ పారిపోయేందుకు పోలీస్‌స్టేషన్ గోడ ఎక్కి కిందకు దూకాడు. గోడ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో ఎడమ కాలు తొడభాగం, చేయి కాలిపోయాయి. తీవ్రగాయాలైన రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే రమేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్పీ శివకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పారిపోతుంటే పోలీసులు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ టూటౌన్ సీఐ నరేందర్‌ను విచారణకు ఆదేశించారు. ఆయన వివరాలు సేకరించి నివేదిక సమర్పించారు. ఈ మేరకు కరీంనగర్ రూరల్ సీఐ డి.కమలాకర్‌రెడ్డి, ఎస్సైలు కె.సృజన్‌రెడ్డి, ఎం.ఆంజనేయులు, త్రీటౌన్ కానిస్టేబుల్ కె.శ్రీనివాస్‌లను ఎస్పీ సస్పెండ్ చేశారు.

నిర్లక్ష్యానికి మారుపేరు..

కరీంనగర్ రూరల్ పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఎస్‌హెచ్‌వో సీఐకి చెప్పినా రిమాండ్‌కు ఆదేశించలేదు. అప్పుడే రిమాండ్‌కు పంపించి ఉంటే నిందితుడు మృతిచెందేవాడు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కిల్ కార్యాలయ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పలేదని తెలిసింది. గతేడాది సెప్టెంబర్ 14న రాత్రి ఇసుక రవాణాను అడ్డుకున్న దుర్శేడ్ గ్రామానికి చెందిన న్యాలం కుమార్‌గౌడ్(26)ను ఇసుక రవాణాదారులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారు. ఈ కేసులో నిందితులకు సర్కిల్ కార్యాలయంలో రాచమర్యాదలు చేశారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసులో విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేసినా నెల రోజులు పాటు నిందితులను అరెస్టు చేయకపోవడంతో పాటు కేసును పక్కదారి పట్టించారని, ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి. చివరకు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారని, వారు బెయిల్‌పై రావడానికి పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వచ్చాయి.

 నిఘా ఎక్కడ?

హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న యాట రమేష్ పోలీసు కస్టడీలో ఉన్న విషయం తెలిసి కూడా రక్షణపై సూచనలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. నిఘా విభాగాలు పోలీసు సిబ్బందికి సరైన విధంగా సూచనలు కూడా చేయడం లేదని సమాచారం. కేవలం ప్రమాదాలు జరిగిన తర్వాత సమాచారం తీసుకోవడం వరకే పరిమితవుతున్నారని, గతంలో కూడా పలు సంఘటనల్లో నిందితులు నిత్యం పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది. నిఘా విభాగ అధికారులను అన్ని రకాలుగా చూసుకుంటున్నారు కనుకనే కొందరు పోలీసు అధికారులను వెనుకేసుకొని వస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు చిన్న తప్పు చేసినా వారిపై నివేదికలు పెడుతూ చర్యలకు సిఫారసు చేస్తున్నారంటున్నారు.

నా భర్త శాడిస్టు..

 ఇద్దరు పిల్లలు పుట్టినా తన భర్త రమేష్ అనుమానంతో నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆయన భార్య సమ్మక్క తెలిపింది. భర్త మృతిచెందాడని తెలుసుకున్న ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రోదించింది. వేధింపులు భరించి కాపురం చేస్తున్నా హత్యాయత్నం చేయడంతో సహించలేక పోలీసులకు ఫిర్యాదు చేశానంది. అయితే తన భర్తకు ఇలా జరుగుతుందనుకోలేదని వాపోయింది.
 
 
 
 

Advertisement
Advertisement