‘కారు’చిచ్చు | Sakshi
Sakshi News home page

‘కారు’చిచ్చు

Published Sat, Nov 10 2018 1:13 PM

disagreement in adilabad TRS - Sakshi

ఖానాపూర్‌: ఖానాపూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీలో మరోసారి అసమ్మతి చిచ్చు రగిలింది. టీఆర్‌ఎస్‌ టికెట్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ప్రకటించడంతో మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ అసమ్మతి జెండా ఎగురవేశారు. టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరి, రేఖానాయక్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాజాగా డీసీసీ మాజీ చైర్మన్, ఏపీపీఎస్సీ మాజీ మెంబర్‌ పైడిపల్లి రవీందర్‌రావు అనుచరులు రేఖానాయక్‌ వ్యవహారిశైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి పదహారు నెలలు అవుతున్నా కనీస గుర్తింపు లేదని, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని రవీందర్‌రావుపై ఒత్తిడి పెంచుతున్నారు.

శుక్రవారం పట్టణంలోని జేకే ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పలువురు పార్టీ కార్యకర్తలతో ఏపీపీఎస్సీ మాజీ మెంబర్‌ రవీందర్‌రావు అధ్యక్షతన భవిష్యత్తు కార్యాచరణపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ముప్పై ఏళ్లుగా తమకు అన్నీ తానై అండగా ఉన్న రవీందర్‌రావు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం కోసం టీఆర్‌ఎస్‌లో చేరామన్నారు. అప్పటినుంచి కనీసం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా తమను పట్టించుకోవడం లేదన్నారు. సదర్‌మాట్‌ సమస్య తెరమీదికి రావడానికి కాల్వల అభివృద్ధికి రవీందర్‌రావు సహకారమే ఉందన్నారు. మిగతా అభివృద్ధి సైతం రవీందర్‌రావు చొరవతోనే సాధ్యమవుతుందన్నారు.
 
అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా...
రవీందర్‌రావు మాట్లాడుతూ.. మరోసారి కేసీఆర్‌ ను సీఎంగా చూడడమే తమ అందరి లక్ష్యమని, అందుకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించా రు. కార్యకర్తల ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, అందరూ సంయమనం పాటించాలని అన్నారు. కార్యకర్తల మనోభావాలు, ఆవేదనను.. పార్టీ అభ్యర్థి రేఖానాయక్‌ వ్యవహార శైలిని అధి ష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అధిష్టానం పట్టించుకోని పక్షంలో కలిసికట్టుగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని హామీ ఇచ్చారు. 

భారీ ర్యాలీ, ఉరేగింపు...
ముందుగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రధాన రహదారిపై వేలాది మందితో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలు గుస్సాడీ సాంప్రదాయ నృత్యాల మధ్య రవీందర్‌రావుతో పాటు ఆయా గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగి లక్ష్మణ్‌రావు, ఎంఏ.వకీల్, కొండాడి గంగారావు, కొత్తపెల్లి సురేష్, బీసీ రాజన్న, పెద్ద లక్ష్మణ్‌రావు, జక్కుల నవీన్‌యాదవ్, లక్ష్మీరాజం, కుమ్మరి భూమన్న, గంగాధర్, గంగారావు, ఖాజా, జక్కుల గంగామణి, మాధవి, తొడసం ఇంద్ర, భీంరావు, శ్రీనివాస్‌రావు, అడిదెల రాజన్న, సతీశ్‌కుమార్, శ్రీనివాస్,  ఎంఏ.సమీ, సంజీవ్‌రావు, సుధాకర్‌రావు, బీసీ రమేశ్, నీలిమాన్, సాయి, సతీశ్, బీరయ్య, భీమన్న, కొమురయ్య, కుమ్మరి గంగరాం, వెంకట్రాములు, నర్సింహారెడ్డి, వెంకటేశ్, బత్తుల నర్సయ్య, కాలేరి రమేష్, బాస రవీందర్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement