‘దిశ’ దర్యాప్తు పురోగతి  రెండురోజుల్లో వెల్లడి! | Sakshi
Sakshi News home page

‘దిశ’ దర్యాప్తు పురోగతి  రెండురోజుల్లో వెల్లడి!

Published Sun, Jul 12 2020 3:30 AM

Disha Case Encounter Latest Update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పురోగతి వివరాలు రెండురోజుల్లో వెల్లడించనున్నట్లు సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌ తెలిపారు. యూపీలో ఎన్‌కౌంటర్‌లో హతమైన వికాస్‌ దూబే ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న క్రమంలో ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపైనా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ‘సాక్షి’కార్తికేయన్‌ను సంప్రదించగా.. ఆయన రెండు రోజుల్లో రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలోని కమిటీ కార్యాలయంలోనే విచారణకు చెందిన పురోగతి గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలను తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియరీ కమిటీకి రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ వీఎస్‌ సిర్పూర్కర్‌ నేతృత్వం వహిస్తుండగా.. విశ్రాంత హైకోర్టు జడ్జి జస్టిస్‌ రేఖా సుందర్‌ బాల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌లు సభ్యులుగా ఉన్నారు. ఆరునెలల కాలపరిమితి విధిస్తూ.. ఆలోపు ఎన్‌కౌంటర్‌పై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. 

అప్పుడేం జరిగింది... 
‘దిశ’కేసులో నలుగురు నిందితులు మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు వెటర్నరీ డాక్టర్‌ అయిన ‘దిశపై 2019 నవంబర్‌ 27న శంషాబాద్‌ సమీపంలో లైంగిక దాడి జరిపి, హతమార్చి పెట్రోల్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు డిసెంబర్‌ 6వ తేదీన సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం ‘దిశ’ను దహనం చేసిన షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లగా.. అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితులు నలుగురూ హతమైన సంగతి విదితమే.

Advertisement
Advertisement