కృష్ణా బేసిన్‌లో అప్పుడే నీటి పంచాయితీ! | Sakshi
Sakshi News home page

కృష్ణా బేసిన్‌లో అప్పుడే నీటి పంచాయితీ!

Published Thu, Jan 24 2019 1:44 AM

Dispute Status On Krishna Tribunal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవికి ముందే కృష్ణాబేసిన్‌లో నీటి పంచాయితీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ ఏడాది కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల కంటే దిగువకు వెళ్లి నీటిని తోడుకునే యత్నాలు ప్రారంభమైనట్లు కనబడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతుండటం, తాగు, సాగు నీటి అవసరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలు బోర్డు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన సాగు, తాగు అవసరాలకు గాను 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరింది. ఇందుకు అవసరమైతే కనీస నీటి మట్టాలకు వెళ్లాలని సూచన చేసింది. దీన్ని కృష్ణాబోర్డు పరిగణనలోకి తీసుకుంటే ఇక్కట్లు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
అడుగంటుతున్న జలాలతో .. 

బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నిల్వలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఇక్కడ 885 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 835.50 అడుగుల మట్టంలో 55.67 టీఎంసీల మేర నిల్వలున్నాయి. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 863.70 అడుగుల మట్టంలో 117.77 టీఎంసీల మేర నిల్వలు ఉండగా, ఈ ఏడాది సగానికి పైగా నిల్వలు తగ్గిపోయాయి.శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా, ప్రస్తుతం కనీస మట్టాలకు ఎగువన లభ్యత కేవలం 2 టీఎంసీలకు మించి లేదు. ఇక నాగార్జున సాగర్‌లో 590 అడుగులకు గానూ 537.70 అడుగుల్లో 183.57 టీఎంసీలుండగా, ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 55 టీఎంసీల మేర నిల్వ ఉంది.

ప్రస్తుతం సాగర్‌ కింద మే నెల చివరి వారం వరకు 48 టీఎంసీల మేర నీటి అవసరాలున్నాయి. మరో 13 టీఎంసీల నీటిని తెలంగాణ అవసరాల కోసం రిజర్వ్‌ చేసి పెట్టారు. ఈ నేపథ్యంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరు ఇరు రాష్ట్రాల అవసరాలను తీర్చేలా లేదు. ఈ సమయంలో తమ రాష్ట్రంలో 58.6 శాతం లోటు వర్షపాతం ఉందని, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 4.54లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి, మిర్చి పంటలకు నీరివ్వడంతో పాటు, తాగునీటి అవసరాల దృష్ట్యా సాగర్‌ కుడి కాల్వ కింద 5 టీఎంసీలు తక్షణం కేటాయించాలని ఏపీ కోరింది.. తమకు ఇదివరకే 33.40 టీఎంసీల నీటిని బోర్డు కేటాయించగా, అందులో 22.32 టీఎంసీల నీటినే వినియోగించుకున్నామని, మరో 11.18 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉందని, ఇందులోంచే తమకు 5 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు బోర్డుకు బుధవారం లేఖ రాశారు.

ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన కోరినంత మేర నీటి నిల్వలు లేనట్టయితే దిగువకు వెళ్లయినా నీటిని కేటాయించాలని అందులో కోరారు. దీనిపై తెలంగాణ వివరణ తీసుకున్న అనంతరం బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. ఒక్కసారి కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తోడటం మొదలు పెడితే జులై, ఆగస్టు నెలల్లో ఇరు రాష్ట్రాల తాగునీటికి కటకట తప్పదని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి.
 

Advertisement
Advertisement