జిల్లా అభివృద్ధికి కృషి | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి కృషి

Published Tue, Jul 15 2014 3:21 AM

District development effort

ప్రజలకు అందుబాటులో ఉంటా
కష్టాలు అనుభవించిన వాడిని
అవినీతిని సహించను.. స్వచ్ఛమైన పాలన అందిస్తా
సీఎం కేసీఆర్ కలలు కన్న తెలంగాణ నిర్మాణానికి కృషి
‘సాక్షి’తో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్

 
కుటుంబ పోషణ కోసం రైల్వే హమాలీగా జీవనం సాగించిన వ్యక్తి నేడు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు. తనకు పేదల సమస్యలు తెలుసని.. వాటినుంచే వచ్చా కనుక వాటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్. జిల్లా పరిషత్ చైర్మన్‌గా జిల్లా అభివృద్ధికి తాను ఎలాంటి ప్రణాళిక తయారు చేసుకున్నారు... అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పాలన అందించనున్నారు... ప్రత్యేకంగా ఏ సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించనున్నారనే అంశాలను భాస్కర్

 ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
 ఆ విషయాలు ఆయన మాటల్లోనే...
 
 జెడ్పీ సెంటర్ :
 ‘‘మాది గద్వాల మండలం కాకులారం. కుటుంబ పోషణకోసం నేను రైల్వే హమాలీగా పనిచేశాను. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల నేను ఇప్పుడు జెడ్పీ చైర్మన్ అయ్యాను. పేదల కష్టాలు ఎలా ఉంటాయో అనుభవించిన వాడిని. కాబట్టి నేను పదవిలో ఉన్నంతకాలం పేదలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యం. జిల్లాలో అపారమైన వనరులున్నాయి. గత ప్రభుత్వాలు  వీటిని వినియోగించుకోలేకపోయాయి. ముఖ్యంగా సుమారు 300 కి.మీ పొడవున కృష్ణానది ప్రవహిస్తుంది. సమైక్య పాలనలో ఆ నీటిని మనకు కాకుండా చేశారు. ఈ నీటి వనరును సద్వినియోగం చేసుకుంటే జిల్లా సస్యశామలం కావడం తథ్యం. ముఖ్యమంతి కేసీఆర్ చెప్పినట్లు అవినీతి అంతం కావాలి. అవినీతి అంతం అయితే ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి పైసా పేదలకు అందుతుంది. స్వతహాగా నేను అవినీతికి వ్యతిరేకం. అవినీతి లేని పాలనను అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తాను. నా పాలనలో అవినీతిని సహించేది లేదు. అవినీతి జరిగిందని తెలిస్తే ఎంత వారైన ఉపేక్షించేది లేదు. నేను కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. జిల్లా పరిషత్ పరిధిలోని పాలన వ్యవహరాలను, శాఖపరంగా ఎం నిధులు వస్తాయి... ఎలా ఖర్చు చేయాలనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సర్పంచ్‌గా పని చేసిన అనుభంతో ముందుకు సాగుతాను. పాలన వ్యవహారాల్లో అధికారులతో స్నేహపూర్వకంగా మెలుగుతాం. అట్లని వారు చేసే తప్పులను ఉపేక్షించం. గత జిల్లా పరిషత్ పాలన మండలి తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలకు పని కొచ్చివి అయితే కొనసాగిస్తాం.

ఆ పాలనలో అవినీతి జరిగిందని తేలితే విచారణ చేపట్టిన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ పునర్‌నిర్మాణం కోసం ప్రజలను భాగస్వాములు చేస్తా. కేసీఆర్ సహకారంతో జిల్లాకు అధిక నిధులు తెచ్చి జిల్లా అభివృద్దికి కృషి చేస్తా. కృష్ణానది నీటి సద్వినియోగం కోసం కేసీఆర్ జూరాల-పాకాల, పాలమూర్ ఎత్తిపోతల పథకం సాధించేందుకు కృషి చేస్తా. బీఆర్‌జీఎఫ్ నిదులు పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. 2014-15 వార్షక ప్రణాళికలు ఇంక సిద్ధం కాలేదు. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రతిపాదిస్తున్నారు. వెంటనే వార్షిక ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం’’.
 

Advertisement
Advertisement