జిల్లాపరిషత్.. జిగేల్ | Sakshi
Sakshi News home page

జిల్లాపరిషత్.. జిగేల్

Published Wed, Aug 13 2014 2:42 AM

జిల్లాపరిషత్.. జిగేల్

సమకూరనున్న సరికొత్త హంగులు
ఆర్చి నిర్మాణం.. రాణిరుద్రమ విగ్రహం ఏర్పాటు
జెడ్పీటీసీ సభ్యులకు వెయిటింగ్ హాళ్లు
 రూ.17 లక్షలకు పైగా వ్యయంతో ప్రతిపాదనలు

 
హన్మకొండ :జిల్లా పరిషత్  కార్యాలయానికి సరికొత్త హంగులు సమకూరనున్నాయి. కొత్తగా కొలువుదీరిన పాలకమండలి ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  వరంగల్ జిల్లా ఘనమైన వారసత్వానికి గుర్తుగా కాకతీయ కీర్తితోరణం, మహిళా సాధికారతకు చిహ్నంగా రాణి రుద్రమదేవి విగ్రహాన్ని  జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేయనున్నారు. పాలనాపరమైన అనుమతుల రాగానే... వీటి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మొదటి పాలకమండలి సమావేశానికి ముందుగానే వీటి నిర్మాణం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే క లెక్టర్ కార్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ మెడికల్ కాలేజీల ఎదుట కాకతీయుల కీర్తితోరణం ఉంది. వాటి సరసన ఇప్పడు జిల్లా పరిషత్ కార్యాలయం చేరనుంది. రూ.14 లక్షల వ్యయంతో కాకతీయ కీర్తితోరణం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం కార్యాలయంలోనికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఉన్న రెండు గేట్లకు మధ్య స్థలంలో కీర్తితోరణ నిర్మాణానికి ఎంపిక చేశారు. గార్డెన్‌లో రాణిరుద్రమదేవి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మొదటిసారి 50 శాతం స్థానాలను రిజర్వ్ చేశారు. దీంతో జెడ్పీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. దీనికి సూచకంగా... మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచిన రాణిరుద్రమదేవి విగ్రహాన్ని  జెడ్పీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. నగరంలో పోచమ్మమైదాన్‌లో ఉన్న రుద్రమదేవి విగ్రహం నమూనాలోనే తయారు చేయించనున్నారు. ఇందుకోసం రూ. 3 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు.

జెడ్పీటీసీలకు వెయిటింగ్ హాళ్ల నిర్మాణం

జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళలు, పురుష జెడ్పీటీసీ సభ్యులకు వెయింగ్ హాళ్లను నిర్మించనున్నారు.  గత పాలకమండలి గడువు పూర్తి అరుున తర్వాత మూడేళ్లపాటు కొత్తపాలక మండలి ఏర్పాటు కాలేదు. దీంతో గతంలో ఉన్న వెయిటింగ్ హాళ్లను ఇతర పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఇటీవల కొత్త పాలకమండలి ఏర్పడిన నేపథ్యంలో వీటి అవసరం మళ్లీ ఏర్పడింది.
 12హెచ్‌ఎంకేడీ01, 02 : జెడ్పీ కార్యాలయం(ఫైల్)
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement