టపాసుల..జీరో దందా! | Sakshi
Sakshi News home page

టపాసుల..జీరో దందా!

Published Sun, Oct 5 2014 3:27 AM

టపాసుల..జీరో దందా! - Sakshi

 దీపావళి పండగ వచ్చిందంటే కనీసం నాలుగైదు శాఖల పంటపండినట్టే. టపాసుల దుకాణాలకు అనుమతులు ఇవ్వడం మొదలుకుని.. పన్నులు వసూలు చేయడం వరకు సాయం చేసినందుకు వీరి జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఆదాయం రాకుండా పోతోంది. జిల్లా కేంద్రంలోని ఓ ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారుల గుప్పిట్లో టపాసుల వ్యాపారం అంతా ‘జీరో’లో కొనసాగుతోంది..!!
 
 సాక్షిప్రతినిధి, నల్లగొండ :  జిల్లావ్యాప్తంగా ప్రతిఏటా కనీసం రూ.20కోట్ల టపాసుల వ్యాపారం జరుగుతోంది. ఇది అనధికారిక లెక్క. ఇదంతా ‘జీరో’దందా. జిల్లా వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకోవడంతో దీపావళి టపాసుల వ్యాపారుల పంట పండుతోంది. అలా అని చిన్నా చితక వ్యాపారులూ లాభపడుతుంది ఏమీలేదు. జిల్లా కేంద్రానికి చెందిన ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు తమ కుటుంబ సభ్యుల పేరున సుమారు 20దాకా లెసైన్సులు సంపాదించి గుప్పిట పెట్టుకున్నారు. వీరికి రెవెన్యూ, పోలీసు, ఫైర్, మున్సిపల్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సహకరిస్తున్నారు.
 
 50 దుకాణాలకు అనుమతి
 ఈసారి జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో యాభై దుకాణాలకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి పట్టణం విస్తరించినందున మరో మూడు నాలుగు పాయింట్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. దేవరకొండ రోడ్, మిర్యాలగూడ రోడ్, హైదరాబాద్ రోడ్డు ప్రాంతాల్లో కూడా టపాసుల దుకాణాలకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ, ఈ ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు ఇవి ఏర్పాటుకాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఒక్కో దుకాణం నుంచి కనీసం రూ.20వేల చొప్పున వసూ లు చేసి కొందరు అవినీతి అధికారుల జేబులు నింపినట్లు సమాచారం. టపాసుల దుకాణాలకు లెసైన్సు లు జారీచేయడంలోనూ ఎలాంటి నిబంధనలు పాటిం చిలేదన్న విమర్శలు ఉన్నాయి. యాభై ఏళ్ల వయసు పైబడిన మహిళల పేరున, 18ఏళ్లు కూడా దాటని యు వకుల పేరున లెసైన్సులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
 
 లక్షలు దాటని ఆదాయం
 ప్రతిఏటా జిల్లా వ్యాప్తంగా కనీసం రూ.20కోట్ల పైనే వ్యాపారం జరుగుతోంది. ఈ లెక్కన హీన పక్షం వాణిజ్య పన్నుల శాఖకు రూ.3కోట్ల ఆదాయం రావా ల్సి ఉంది. కానీ, ఇది రూ.లక్షలు కూడా దాటడం లేదు. అసలు టపాసుల వ్యాపారులకు విధించిన ట్యాక్సు ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో వివరాలు చెప్పడానికి కూడా ఆ శాఖ అధికారులు సిద్దంగా లేరు. ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఒక్క జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన యాభై స్టాల్స్‌లో ఒక్కో స్టాల్‌లో కనీసం రూ.2లక్షల విలువైన సరుకు ఉంటుంది. అంటే కోటి రూపాయలు. ఇవి కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే వ్యాపారం ఉండనే ఉంది. ఇలా మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి వంటి ప్రధాన కేంద్రాలతో పాటు దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోంది. గడిచిన రెండేళ్లుగా టపాసుల విక్రయాలు మరింత జోరందుకున్నాయని వ్యాపార వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం మాత్రం పెరగడం లేదు. నామ మాత్రంగా పన్నులు వేసి, జీరో దందాను ప్రోత్సహిస్తున్నారు. దీంతో శాఖకు చెందిన కొందరు అధికారులు, సిబ్బంది జేబులు మాత్రం నిండుతున్నాయి.
 
 ఒక్క నల్లగొండలో జరిగే వ్యాపారం ద్వారానే కనీసం రూ.30లక్షలు, జిల్లా వ్యాప్తంగా జరిగే వ్యాపారంపై పన్నుల రూపంలో సుమారు రూ.3కోట్ల ఆదాయం రావాల్సి ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కానీ, సొంతలాభం కొంత చూసుకుంటున్న కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. టపాసుల దుకాణాలకు లెసైన్సులు ఇవ్వడంతో సంబంధం ఉన్న ఆయా శాఖలతోపాటు, కలెక్టరేట్‌లోనే సంబంధిత సెక్షన్‌లో ఓ ఉద్యోగి చేతివాటంతో నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారం లెసైన్సులు జారీ చేశారని చెబుతున్నారు. ఒకేచోట దుకాణాలు ఏర్పా టు చేయడంలోనూ భారీ మొత్తంలో డబ్బులు చేతు లు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఈ లెసైన్సుల జారీ వ్యవహారంపై దృష్టి పెడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇక, జీరో దం దాను ప్రోత్సహిస్తూ నామమాత్రంగా మాత్రమే పన్నులు వసూలు చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారంపైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంది. అనుమతుల్లేకుండా జనావాసాల మధ్య పెద్దమొత్తంలో టపాసులను నిల్వ చేశారని సమాచారం. జిల్లా కేం ద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని రెండు గోదాముల్లోనూ వీటిని అక్రమంగా నిల్వ చేశారని తెలుస్తోంది.
 

Advertisement
Advertisement