సమ్మె విరమించకుంటే ‘ఎస్మా’ | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించకుంటే ‘ఎస్మా’

Published Wed, Oct 22 2014 12:49 AM

సమ్మె విరమించకుంటే ‘ఎస్మా’

బ్లాక్‌మెయిల్‌కు లొంగం.. సమ్మె విరమిస్తేనే చర్చలు  జూడాలకు ప్రభుత్వం స్పష్టీకరణ

హైదరాబాద్: ‘‘ప్రజారోగ్యాన్ని పణంగా పెడితే ఉపేక్షించం. జూనియర్ డాక్టర్ల బెదిరిం పులు, బ్లాక్‌మెయిల్‌కు లొంగం. సమ్మె విరమించకుంటే ‘ఎస్మా’ ప్రయోగించడానికీ వెనుకాడం. ఎస్మా పరిధిలో లేమని భావించ వద్దు. గతంలో రెండుసార్లు ఎస్మా ప్రయోగించారు. తక్షణం సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మె విరమిస్తేనే ఇక చర్చలు. దీనికి డెడ్‌లైన్లు అంటూ ఏమీ లేవు. యాక్షన్ మొదలైంది. ప్రభుత్వం జూడాల అయిదు డిమాండ్లలో నాలుగింటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది’’ అని వైద్య విద్య డెరైక్టర్ (డీఎంఈ) డాక్టర్ పి.శ్రీనివాస్ స్పష్టంచేశారు. గడిచిన 20 రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ సమ్మె, వారి డిమాండ్లు, ప్రభుత్వ స్పందన వంటి వివరాలను మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు. గతనెల 29న మొదలైన జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఇప్పటికే అయిదు పర్యాయాలు చర్చలు జరిపామన్నారు.

ఏడాది పాటు తప్పనిసరి ప్రభుత్వ సర్వీసును పూర్తి చేయాలన్న నిబంధనను తొలగించాలని చేస్తున్న డిమాండ్ మినహా మిగిలిన నాలుగు డిమాండ్లను అంగీక రిస్తున్నట్లు చెప్పారు.  డెరైక్ట్ రిక్రూట్‌మెంటుకు సానుకూలంగా ఉన్నామని, స్టయిఫండ్ 15 శాతం పెంచేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. గౌరవ వేతనం పెంచడం, కంపల్సరీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేయడానికి ఇతర విభాగాలతోనూ చర్చించాల్సి ఉంటుందన్నారు. ఇక తప్పని సరిగా ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసును పూర్తి చేయాలన్న నిబంధనను సడలించలేమని తేల్చిచెప్పారు. మూడేళ్లు ఉన్న సర్వీసును ఇప్పటికే ఏడాదికి తగ్గించారని, అయినా, ఈ కేసు కోర్టులో ఉన్నందున స్పందించలేమన్నారు. గత ఏడాది తీసుకు వచ్చిన ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (యాక్ట్ 10/2013)ను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందన్నారు.

సమ్మె కాలాన్ని గైర్హాజరుగా పరిగణిస్తాం

 జూనియర్ వైద్యులు ప్రజారోగ్యం గురించి ఆలోచించడం లేదని, ఈసారి సమ్మె కాలాన్ని గైర్హాజరుగా పరిగణిస్తామని, ఈ కాలానికి ఎట్టి పరిస్థితుల్లో స్టైఫండ్ ఇవ్వమని డీఎంఈ స్పష్టంచేశారు. వాస్తవానికి వీరంతా పీజీ విద్యార్థులని, సమ్మె విరమించకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, సమ్మెను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు సమ్మె చేశారని, 2012లో ఏకంగా 55 రోజులు సమ్మె చేసినా, ప్రభుత్వం సహృదయంతో ఆలోచించిందని, దీన్ని ప్రభుత్వ బలహీనతగా భావించవద్ద ని హితవు పలికారు. ఆగస్టులో అడ్మిషన్లు పూర్తయ్యాకో, ఫిబ్రవరిలో ఎన్నికలకు ముందో సమ్మె చేయడం జూనియర్ డాక్టర్లకు ఆనవాయితీగా మారిందన్నారు. స్టయిఫండ్ బకాయిలకు ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసిందన్నారు. బోధనాసుపత్రుల్లో ఎస్పీఎఫ్ భద్రత కల్పించేందుకూ సానుకూలంగా ఉన్నామన్నారు.
 
 ప్రాణత్యాగానికైనా సిద్ధం: జూడాలు
 

హైదరాబాద్: ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ఆడిటోరియంలో యువ వైద్య గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆదిత్య, స్వప్నిక మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ డాక్టర్లు పనిచేయాలనే నిబంధనను రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్యకు అర్బన్, రూరల్ పోస్టులపై అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, కేఎంసీ, రిమ్స్ తదితర ఆసుపత్రుల నుంచి వచ్చిన వెయ్యి మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.

 ‘జూడా’ల సమ్మెకు.. కాంగ్రెస్ మద్దతు

హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని, వారు ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశానికీ హాజరవుతామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు మల్లు రవి, కొంగల మహేష్ ఒక ప్రకటలో తెలిపారు. ‘జూడా’ల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.  సమ్మె వల్ల పేదరోగులు పడుతున్న ఇబ్బందుల పరిగణలోకి తీసుకుని  వైద్య ఆరోగ్య శాఖా మంత్రి భేషజాలు వదిలి వెంటనే చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వారి వెన్నంటి కాంగ్రెస్ నిలబడుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు ఆప్రకటనలో  కోరారు.
 
 

Advertisement
Advertisement