ఇక నుంచి ఒకే పీఎఫ్ నంబర్ | Sakshi
Sakshi News home page

ఇక నుంచి ఒకే పీఎఫ్ నంబర్

Published Sat, Aug 23 2014 11:47 PM

ఇక నుంచి ఒకే పీఎఫ్ నంబర్

కంపెనీ మారినానంబరు మారదు
పీఎఫ్ ఖాతాలేకపోతే ఫిర్యాదులు చేయండి
పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్‌కుమార్
పటాన్‌చెరు: ఇక నుంచి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులందరికీ పర్మినెంట్‌గా ఒకే నంబర్ (యూనిక్)ను కేటాయిస్తున్నామని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్‌కుమార్ తెలిపారు. ఇక నుంచి ఖాతాదారులెవరూ కంపెనీలు మారినప్పుడల్లా కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదన్నారు. తమ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 1,88,327 మంది ఖాతాదారులందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను కేటాయించామన్నారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికీ పీఎఫ్ ఖాతా నంబర్ తెలియని వారు వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని అడిగి నంబర్ తెలుకుకోవాలన్నారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల పీఎఫ్ నంబర్లను వారికి తెలపాలన్నారు.     ఓ వ్యక్తి పేరు మీద పీఎఫ్ సొమ్ము నెలవారీగా అందితే అతనికి నిర్ణీత నంబర్ (పన్నెండకెల సంఖ్య)ను కేటాయించామని స్పష్టం చేశారు.

గతంలో కాకుండా పీఎఫ్ క్లెయిమ్‌లను కూడా త్వరితగతిన చేపడుతున్నామన్నారు. ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కటింగ్ చేసి సదరు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో సొమ్ము జమచేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసలు పీఎఫ్‌లు కట్టని సంస్థలు 300 ఉన్నట్లు గుర్తించామని, త్వరలోనే ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు.
 
ఖాతాదారులందరూ ఆధార్ ఇవ్వాల్సిందే
పీఎఫ్ ఖాతాదారులందరూ తమకు కేటాయించిన యూనిక్ నంబర్‌తో తమ ఆధార్ కార్డు నంబర్‌ను జత చేయాలన్నారు. అలాగే ఖాతాదారులందరూ తమ బ్యాంకు ఖాతాల అకౌంట్ నంబర్‌తో పాటు, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ సమర్పించాలన్నారు. ఖాతాదారులందరూ తమ సంస్థల ద్వారానే వివరాలను పీఎఫ్ కార్యాలయానికి పంపాలన్నారు. ఇక నుంచి క్లెయిమ్ పరిష్కారం తర్వాత పీఎఫ్ మొత్తం నేరుగా ఖాతాదారుడి బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తామన్నారు.
 
ఫిర్యాదు చేయండి
పీఎఫ్ సమస్యలపై ఎవరైనా సరే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గ ణేష్‌కుమార్  సూచించారు. కాంట్రాక్టర్ చేసే మోసాలు, లేదా యా జమాన్యం చేస్తున్న మోసాలపై ఎప్పటికప్పుడు తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉద్యోగుల పేరిట పీఎఫ్ ఖాతా తెరవని సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులెవరైనా టటౌ.ఞ్చ్ట్ట్చఛిజ్ఛిటఠః ్ఛఞజజీఛీజ్చీ.జౌఠి.జీ కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అలాగే ప్రతి నెల 10వ తేదీన భవిష్యనిధి అదాలత్‌లో కూడా ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
 
పీఎఫ్ పెన్షన్ రూ.1000

ఫీఎఫ్ ఖాతాదారులకు కనీసంగా రూ. వెయ్యి పింఛన్ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. 2014 ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందన్నారు. అయితే ఖాతాదారులకు పెరిగిన పింఛన్ ఇవ్వడం లేదన్నారు. అక్టోబర్ నెల నుంచి పెంచిన పింఛన్ ఇస్తామన్నారు.  ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం బకాయిలన్నింటినీ విడుదల చేస్తామన్నారు. ఖాతాదారుల పింఛన్ స్థాయిని బట్టి పింఛన్ పెరుగుతుందన్నారు. కానీ కనీస పింఛన్ మాత్రం రూ.వెయ్యి ఉంటుందన్నారు.

Advertisement
Advertisement