చంద్రశేఖరా.. గొంతెండుతోంది | Sakshi
Sakshi News home page

చంద్రశేఖరా.. గొంతెండుతోంది

Published Sat, May 9 2015 12:46 AM

చంద్రశేఖరా.. గొంతెండుతోంది - Sakshi

మీరు చెప్పినా.. నీరివ్వలె!
గజ్వేల్ నియోజకవర్గంలో మంచినీటి కటకట
సీఎం ఆదేశించినా పట్టని అధికారులు
నిధుల విడుదలలో జాప్యమే కారణం?

 
 సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే మంచినీటికి జనం కటకటలాడుతున్నారు. 20 రోజులుగా నీటి సరఫరా లేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లో నీటి కష్టాలు రానివ్వొద్దని కేసీఆర్ స్వయంగా ఆదేశించినా అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరోవైపు బోరుబావుల్లో భూగర్భ జలమట్టం వడివడిగా పడిపోతోంది.

గజ్వేల్ : గజ్వేల్ నగర పంచాయతీ ప్రజానీకాన్ని కొన్ని రోజులుగా నీటి సమస్య కటకటలాడిస్తోంది. ఫలితంగా ఈనెల 5న ప్రజ్ఞాపూర్ ఏడో వార్డులో దాహర్తి తీర్చాలంటూ మహిళలు రోడ్డెక్కాల్సి వచ్చింది. సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా ఉంది. తాజాగా శుక్రవారం జరిగిన నగర పంచాయతీ పాలకవర్గ సమావేశంలో మంచినీటి సమస్యపై ఇద్దరు మిహ ళా కౌన్సిలర్లు ధర్నా చేయడం సమస్య తీవ్రతను చాటుతోంది.

నగర పంచాయతీలో ఈ వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు గడిచిన ఫిబ్రవరిలోనే అధికారులు రూ.61 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. నిజానికి ఈ నిధులు వేసవి ఆరంభంలో అంటే మార్చిలోనే విడుదల కావాలి. కానీ అధికారులు ఆలస్యంగా ప్రతిపాదనలు పంపడంతో ఏప్రిల్ 27న రూ.30 లక్షలను మాత్రమే మంజూరుచేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు.

నిధులు సకాలంలో విడుదలై ఉంటే నగర పంచాయతీ పరిధిలో ట్యాంకర్లను పెంచే వారమని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరు ట్యాంకర్లు నడుపుతున్నారు. మరో అయిదు వరకు ట్యాంకర్‌లు తక్షణమే నడపాల్సి ఉంది. నిజానికి ఈ నెల 5న ఏడో వార్డులో జరిగిన ధర్నాకు ట్యాంకర్ల పెంచకపోవడమే కారణం. తాజాగా విడుదలైన నిధులతో ట్యాంకర్ల సంఖ్య మరో రెండుకు పెంచుతామని కమిషనర్ శంకర్ చెబుతున్నారు.

ఈ ట్యాంకర్లు మరో రెండు నెలలపాటు నిరంతరంగా నడిసేన్తే ఈ సీజన్ గట్టెక్కుతుంది. నియోజకవర్గంలో మంచినీటి సమస్య రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై నిరసన వ్యక్తమవుతోంది. మరో విషయమేమిటంటే 0.7ఎంఎల్‌డీ (7 లక్షల లీటర్లు) మంజీర మంచినీటి పథకం ద్వారా సరఫరా కావాల్సి ఉండగా 20 రోజులుగా ఈ నీటి సరఫరా నిలిచిపోయింది.

నర్సాపూర్ సమీపంలోని బోర్పట్ల సంప్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. పట్టణంలోని ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి రోజువారీ సరఫరా అవుతున్న నీటికి తోడుగా మంజీర నీరందితే కొంత ఉపశమనం కలిగేది. పరిస్థితి భిన్నంగా మారటంతో నగర పంచాయతీ ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శుక్రవారం  నీటి సరఫరాను పునరుద్ధరించడం కాసింత ఉపశమనం కలిగించింది.

నీళ్లకు మస్తు తిప్పలైతుంది...
 మంచినీటికి మస్తు తిప్పలైతుంది. సరిపోయేటన్ని ట్యాంకర్లు వస్తలేవ్వు. నీళ్లు దొరకక కష్టాలు పడుతున్నం. ఇప్పటికైనా మా కష్టాలు తీర్చాలె.
 - మడిపడిగ గాలయ్య (భారత్ నగర్)

Advertisement
Advertisement