రూ. 500కు ట్రిప్పు నీళ్లు | Sakshi
Sakshi News home page

రూ. 500కు ట్రిప్పు నీళ్లు

Published Sat, May 5 2018 7:21 AM

Drinking Water Problems In Peddapalli - Sakshi

వేములవాడ : వేములవాడలో భూగర్భ జలాలు అడుగంటిపోయి... చుక్కనీరు దొరకడం కష్టంగా మారింది. ఇండ్లలో ఉన్న బోర్లతో పాటు మున్సిపాలిటీ వారు వేసిన బోర్లు సైతం ఎండిపోతుండటంతో జలఘోష పెరిగిపోతుంది. ఎండాకాలమంతా ఎట్లా గడవాలంటూ జనం ఆందోళన చెందుతున్నారు. రూ. 500 వెచ్చించి ట్యాంకర్‌ నీళ్లు కొనుక్కొని అవసరాలు తీర్చుకుంటున్నారు.

 
పట్టించుకోని పాలకులు

నీటి కొరతపై పాలకులు పట్టించుకోకపోవడంతో కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఇంటిబోర్లు ఎండిపోయాయి. అర్ధరాత్రి వరకు పైప్‌లైన్‌ నీరు పట్టుకునేందుకు ఆరాటం తప్పడం లేదు. సుట్టపోళ్లు వస్తే ఇక నీళ్ల గోస చెప్పరాదు. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో బంధుగణం రాక పెరిగిపోతుందని జనం చెప్పుకుంటున్నారు.మున్సిపాలిటీ వాళ్లు సరఫరా చేసే నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.


రూ. 500కు ట్రిప్పు నీళ్లు

నీళ్లు లేనిదే దినం గడవదు. అలాంటి నీళ్ల కోసం ఎములాడ జనం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటి అవసరాల కోసం నీళ్లు కావాలంటే రూ. 500 పెట్టి ట్యాంకర్‌ నీళ్లు కొనాల్సిందే. చిల్లరగా డ్రమ్మునీళ్లకు రూ. 50 చొప్పున హోటళ్లు, నిరుపేదలు, సామాన్య ప్రజానీకం కొనుక్కుంటున్నారు. జనవరి మాసం నుంచే నీటి పరిస్థితి ఇలా కొనసాగుతుందని జనం మొత్తుకుంటున్నారు.

 
ఎటు చూసినా ట్యాంకర్లే....

భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో వేములవాడలో నీటి కొరత పెరిగిపోయింది. దీంతో ఇక్కడి ట్రాక్టర్‌ యజమానులు ఓ ట్యాంకర్‌ తయారు చేసుకుని నీటి వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇసుక రవాణాపై ప్రభుత్వం, అధికారులు కాస్త కట్టడి చేయడంతో నీళ్ల వ్యాపారం చేసుకున్నది మేలనుకుంటూ ఈ వంక చూస్తున్నారు. దీంతో వేములవాడలో ఇటీవల వందకు పైగా ట్యాంకర్లు రోడ్లపై కనిపిస్తున్నాయి. ప్రైవేట్‌ బోర్ల వద్ద రూ. 100 చొప్పున నీటిని కొనుగోలు చేసి రూ. 500 ఒక ట్రిప్పు నీళ్లు అమ్మకాలు సాగిస్తున్నారు.


అన్నీ వార్డుల్లో అవస్థలే...

వేములవాడ పట్టణంలోని 20 వార్డులలో తాగు నీటి కొరత తీవ్రమైంది. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు నీటి సరఫరాపై సరైన ప్రణాళికలు రూపొం దించడం లేదు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చుడే కానీ... మా బాధలు పట్టించుకున్న పాపాన పోవడం లేదంటూ బాహాటంగా ఆరోపిస్తున్నారు. తాగునీటి కోసం రూ. 30 లక్షల నిధులు కేటాయిస్తున్నామంటూ మున్సిపల్‌ సమావేశంలో తీర్మానించారు.

ఇబ్బందులు తీరుస్తాం

వేములవాడ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం. రూ. 30 లక్షలతో తాగునీటి సరఫరా చేసేందుకు ఇటీవలే తీర్మానించాం. అలాగే ఎల్‌ఎండీ, మానేరు డ్యాం నుంచి వచ్చే నీటిని పొదుపుగా వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

1/1

ఏ. జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్‌ కమిషనర్

Advertisement

తప్పక చదవండి

Advertisement