చిమ్మచీకటి | Sakshi
Sakshi News home page

చిమ్మచీకటి

Published Thu, Oct 30 2014 3:49 AM

చిమ్మచీకటి - Sakshi

పల్లెలు, పట్టణాల్లో కరెంట్ కట్
* భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు
* చెల్లించాల్సిందేనంటున్న ట్రాన్స్‌కో
* ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటున్న పంచాయతీలు
* తాగునీటికీ తప్పని తిప్పలు

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లావ్యాప్తంగా 671 గ్రామ పంచాయతీలు సుమారు రూ.50 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయనే కారణంతో ఐదు రోజుల క్రితం జిల్లా పంచాయతీ కార్యాలయం సహా అన్ని పంచాయతీలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలకు ప్రాణవాయువుగా ఉన్న తాగునీటి సరఫరాకు సైతం ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రతను కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి దృష్టికి జిల్లాలోని సర్పంచులు తీసుకెళ్లడంతో ఆయన చొరవ తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు మంచినీటిని సరఫరా చేసే మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

వీధిదీపాలకు కావాల్సిన విద్యుత్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. పూర్తి బకాయిలతో బిల్లులు చెల్లిస్తే తప్ప తాము చేసేదేమీ లేదని ట్రాన్స్‌కో అధికారులు కరాఖండిగా చెబుతున్నారు. ఈ క్రమంలో సర్పంచులు కలెక్టర్ ఇలంబరితిని మంగళవారం కలిశారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ట్రాన్స్‌కో అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని విన్నవించారు. 

సర్పంచులుగా తాము పగ్గాలు చేపట్టి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ప్రభుత్వం నుంచి టీఎఫ్‌సీ నిధులు అరకొరగా ఒక్కసారి మాత్రమే వచ్చాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవి తప్ప పంచాయతీల నిర్వహణకు మరే రకమైన నిధులు లేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికే తాగునీటి సరఫరా, పంచాయతీ కార్యాలయాల నిర్వహణ తదితర ఖర్చులను అతి కష్టంగా భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాము పూర్తి బకాయిలను చెల్లించలేమని సర్పంచుల సంఘం కలెక్టర్‌కు విన్నవించింది.
 
నిధుల్లేక కష్టాలు
గతంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన టీఎఫ్‌సీ నిధులను ప్రభుత్వమే విద్యుత్ బకాయిల కింద నేరుగా ట్రాన్స్‌కోకు జమ చేసింది. దీంతో గ్రామ పంచాయతీలపై విద్యుత్‌భారం పడకుండా కొంతకాలం నెట్టుకువచ్చారు. అయితే మూడు, నాలుగేళ్లుగా విద్యుత్ బకాయిలపై ట్రాన్స్‌కో ఒత్తిడి చేయకపోవడం, పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో విద్యుత్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. గత పాలక వర్గాల హయాంలోని విద్యుత్ బిల్లులను కట్టడానికి అనేక మంది సర్పంచులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చిన్న గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అధికార వర్గాలే ఉటంకిస్తున్నాయి.

గ్రామ పంచాయతీల్లో స్వయం పాలన ఉన్నప్పుడే నిధుల సమీకరణ సైతం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి పన్ను వేయడం ద్వారా నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా  ప్రతి సంవత్సరం సుమారు రూ.18 కోట్లు  ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ. 5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వసూలు కాకపోవడంతో పంచాయతీల నిర్వహణపై ఇటు అధికారులు, ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇవేవీ తమ పరిధిలోని అంశాలు కానట్టు బకాయిల కోసం ట్రాన్స్‌కో కొరడా ఝుళిపించడంతో పరిస్థితి అయోమయంగా మారింది. సర్పంచుల విజ్ఞప్తి మేరకు స్పందించిన కలెక్టర్ ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని తనకు నివేదిక రూపంలో ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌ను ఆదేశించారు. ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకుని విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని, అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేని పంచాయతీలు కొన్ని నెలల విద్యుత్ బిల్లులు చెల్లించి, మిగతావి చెల్లించేందుకు కొంత సమయం వెసులుబాటును ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ట్రాన్స్‌కో అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది.

ట్రాన్స్‌కో, పంచాయతీల మధ్య ఏర్పడిన ఈ విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆగాధం గ్రామీణ ప్రాంతాల్లో అంధకారానికి దారితీస్తోంది. రాత్రి 7 దాటితే చాలు అనేక గ్రామాల్లో వీధి దీపాలు లేక చిమ్మచీకట్లు కమ్ముకుని చిట్టడువులను తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పంచాయతీ జిల్లా కార్యాలయానికి సైతం అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సుమారు రూ.లక్షకు పైగా బకాయి ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ కార్యాలయ భవనం తొలుత ఖానాపురం హవేలి గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉండేది.  నగరపాలక సంస్థ ఆవిర్భావం అనంతరం అందులో విలీనం కావడంతో మున్సిపల్ డివిజన్ కార్యాలయంగా కొద్దికాలం పనిచేసింది.

ఆ సమయంలో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం ఇప్పుడు డీపీఓ కార్యాలయానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. కార్పొరేషన్, గ్రామ పంచాయతీల మధ్య నలుగుతున్న ఈ బిల్లుల పంచాయిని ఏ విధంగా పరిష్కరించాలో అధికారులకు ఒక పట్టాన అర్థం కావడం లేదు. రెండు రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి బకాయిలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తే తప్ప విద్యుత్ సరఫరా ఇవ్వలేమని ట్రాన్స్‌కో తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీ పాలకవర్గాలు బిల్లులను చెల్లించడానికి తమ వద్ద నిల్వ ఉన్న నిధులు, ఇంకా కావాల్సిన నిధులను సేకరించే పనిలో పడ్డాయి.

Advertisement
Advertisement