ఆ ముగ్గురి ఫొటోలు తీసేశారు! | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురి ఫొటోలు తీసేశారు!

Published Sat, Jul 4 2015 7:44 PM

ds, bothsa, kk photos removed from gandhi bhavan

హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణల ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్వయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గాంధీభవన్‌లో శనివారం వీహెచ్, మాజీమంత్రి దామోదర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం ముగుస్తుందనగా.. పార్టీ వదిలివెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుల ఫొటోలను ఎప్పుడు తొలగిస్తున్నారంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. ఆ వెంటనే హనుమంతరావు రంగంలోకి దిగారు. సహచర నేత దామోదర్‌రెడ్డి సహాయంతో ముందుగా కె.కేశవరావు ఫొటోను తొలగించారు. ఆ తరువాత దామోదర్ రెడ్డి ఓ కుర్చీ వేసుకుని దానిపైకి ఎక్కి మరో వైపు ఉన్న డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణల ఫోటోలను తొలగించారు.

కాగా, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారి ఫొటోలను వారు పనిచేసిన కాలం వివరాలతో గాంధీభవన్‌లో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. అయితే.. కేకే, డీఎస్, బొత్స ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరారు. వీరి ఫొటోల తొలగింపుపై పార్టీ అధిష్ఠానం నుంచి ఇంకా ఒక నిర్ణయం రాకముందే వి.హనుమంతరావు, దామోదర్ రెడ్డి ఆ పని పూర్తి చేశారు.

Advertisement
Advertisement