ఢిల్లీలో డీఎస్ లాబీయింగ్! | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో డీఎస్ లాబీయింగ్!

Published Thu, May 29 2014 2:20 AM

ఢిల్లీలో డీఎస్ లాబీయింగ్! - Sakshi

 - శాసనమండలి ఫ్లోర్‌లీడర్ కోసం యత్నం
 - దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి మంతనాలు
 - సీనియర్ నేతగా ఆయనకే దక్కే అవకాశం?

 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయిన ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీలో మకాం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్‌కు చేరిన ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణకు చెందిన పలువురు టీ-కాంగ్రె స్ నాయకులు సైతం ఢిల్లీలోనే ఉన్నారు. డీఎస్ రెండు రోజుల నుంచి కీలక పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రజల మనోభావాలను అధినేత్రి సోనియాకు తెలిపేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారు. అయితే ఈసారి మాత్రం శాసనమండలి ఫ్లోర్‌లీడర్ పదవి కోసం దేశ రాజధానికి చేరిన ఆయన బుధవారం ఢిల్లీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో డీఎస్ భేటీ అయినట్లు సమాచారం. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం.. ఆ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనమండలి పక్షనేతగా అవకాశం కల్పించాలని కోరినట్లు పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన డీఎస్ అనతికాలంలోనే దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా ఎదిగారు. 1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై విజయం సాధించిన ఆయన 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. 2004, 2009లలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్‌ఆర్ సీఎం కాగా.. ఆ రెండు ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన డీఎస్ అధిష్టానానికి మరింత దగ్గరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో అర్బన్‌గా మారిన నిజామాబాద్ నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చెందిన ఆయనకు ఈసారి నిజామాబాద్ రూరల్‌ను ఎంచుకున్నప్పటికీ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలోనూ ఓటమి తప్పలేదు.

 అయితే 2010 ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన డీఎస్‌కు  2011 అక్టోబర్‌లో కాంగ్రెస్ అధిష్టానం శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యునిగా ఉన్న తనకు తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలికి తొలి ఫ్లోర్‌లీడర్‌గా అవకాశం కల్పించాలని దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు సమాచారం. ఇదిలా వుండగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ కూడ ఇదే పదవి కోసం ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయన కూడా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసింది. అయితే డీఎస్‌కే ఈ విషయంలో అధిష్టానం అనుకూలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement