ఈ-బీట్.. సక్సెస్

5 Oct, 2014 03:30 IST|Sakshi
ఈ-బీట్.. సక్సెస్

 కోదాడటౌన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యపట్టణాల్లో పోలీసుల రాత్రిగస్తీపై వస్తున్న విమర్శలకు చెక్‌పెట్టేందుకు ఈ-బీట్ పేరిట కొత్త టెక్నాలజీని అమలులోకి తెచ్చింది. ఈ టెక్నాలజీని ముందుగా కోదాడలో ప్రయోగాత్మకంగా అమలుచేసింది. ఇది విజయవంతం కావడంతో జిల్లావ్యాప్తంగా ఈ నెల నుంచి అమలు చేయాలని జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ఆదేశించారు. దీనికోసం జిల్లా పోలీసులు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేశారు. అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఎస్పీ రూ. 10 లక్షలు కూడా మంజూరు చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ- బీట్ మొదలుకానుంది.
 
 గతంలో గస్తీపై పలు విమర్శలు..
 జిల్లావ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో రాత్రి సమయాల్లో కొంతమంది సిబ్బందిని గస్తీకి నియమించారు. వీరు రాత్రి సమయాల్లో పూర్తిస్థాయిలో గస్తీ తిరగకపోవడం.. ఏమరుపాటుగా వ్యవహరిస్తుండడం.. కొంతమంది ఇంటికి వెళ్లి పడుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి.  ఫలితంగా దొంగతనాలు పెరిగిపోతున్నాయనే అపవాదు వచ్చింది. సిబ్బంది తాము గస్తీ తిరగుతున్నామని చెపుతున్నా దీనిలో లోపాలున్నాయని అధికారులు భావించారు. రాత్రి గస్తీని పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆలోచించారు. దీనికోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కోదాడ పట్టణంలో దానిని ప్రయోగాత్నకంగా ప్రవేశపెట్టారు. ఇది వంద శాతం సల్ఫిలితాలు ఇవ్వడంతో రూ.10 లక్షల వెచ్చించి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు.
 
 ఈ- బీట్ ఎలా పనిచేస్తుందంటే...
 ఈ-బీట్ పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ముందుగా ఒక పట్టణాన్ని 10 బీట్‌లుగా విభజిస్తారు. ఒక బీట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన సెల్‌ఫోన్ ఇస్తారు. ఈ విధంగా 10 బీట్లకు పది ప్రత్యేక సెల్‌ఫోన్లను అందిస్తారు. వాటిని ఇంటర్‌నెట్ ద్వారా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఆ బీట్ కానిస్టేబుళ్లు వారికి కేటాయించిన ప్రాంతంలో ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చు. బీట్ నుంచి పక్క రోడ్డుకు వెళ్లినా వెంటనే కంప్యూటర్‌లో నమోదవుతుంది. ప్రతి 50 మీటర్లకు ఒకసారి ఆ బీట్ కానిస్టేబుల్ కదలికలను నమోదు చేయడంతో పాటు సమయాన్ని కూడా కచ్చితంగా సూచిస్తుంది. స్టేషన్ నుంచి బయలుదేరిన సమయం, బీట్‌లో ఎక్కడ ఏ సమయంలో ఉన్నది కూడా నమోదు కావడంతో ఆ కానిస్టేబుళ్లు ఒక్కఅడుగు కూడా పక్కకు వెళ్లడానికిగానీ, బీట్‌చేయకుండా ఉండడానికి గానీ వీలుండదు. ఈ-బీట్‌ను తమ కార్యాలయాల్లో ఏర్పాటుచేసినకంప్యూటర్ల ద్వారా డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు కూడా నేరుగా చూడవచ్చు. తమ కార్యాలయాల నుంచి పర్యవేక్షణ చేయవచ్చు. కావాలనుకుంటే గత రోజు రాత్రి బీట్ ఎలా చేశారో కూడా చూడవచ్చు.
 

మరిన్ని వార్తలు