వయోపరిమితి సడలింపు పదేళ్లు? | Sakshi
Sakshi News home page

వయోపరిమితి సడలింపు పదేళ్లు?

Published Fri, Jul 24 2015 1:47 AM

Easing ten years of age ?

ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఆలోచన
యూనిఫాం సర్వీసులకు ఐదేళ్లు సడలింపు!

 
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయో పరిమితి సడలింపును పదేళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో భర్తీ చేసే పోస్టుల గరిష్ట వయోపరిమితికి పదేళ్లు సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ టీఎస్‌పీఎస్సీ పరీక్షల విధానం, వయోపరిమితి సడలింపు తదితర అంశాలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

అందులో ఐదేళ్ల సడలింపును ప్రతిపాదించింది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు రానందున.. ఐదేళ్ల సడలింపు సరిపోతుందని, పదేళ్లు పెంచితే కొన్ని కేటగిరీల్లో ఉద్యోగి సర్వీసు కాలం తగ్గిపోతుందని పేర్కొంది. కానీ నిరుద్యోగులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి గరిష్ట వయోపరిమితిని పదేళ్లు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పదేళ్ల సడలింపునకు సీఎం అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు యూనిఫాం (పోలీసు వంటి) సర్వీసుల్లో ఇంతకుముందు గరిష్ట వయోపరిమితిని పెంచలేదు. కానీ ఈసారి వాటిల్లోనూ గరిష్ట వయోపరిమితికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలన్న యోచనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement