ఏడ్నెల్ల పసిగుడ్డు ప్రభుత్వంపై ఏడుపెందుకు? | Sakshi
Sakshi News home page

ఏడ్నెల్ల పసిగుడ్డు ప్రభుత్వంపై ఏడుపెందుకు?

Published Sun, Jan 25 2015 1:20 AM

ఏడ్నెల్ల పసిగుడ్డు ప్రభుత్వంపై ఏడుపెందుకు? - Sakshi

  • దుర్మార్గంగా అవాకులు చెవాకులు పేల్చుతున్నారు
  • పొన్నాల దశాబ్దాలుగా మంత్రిగా ఉండి ఏం చేశారు?
  • నాలుగేళ్లలో తాగునీళ్లివ్వకపోతే ఓట్లడగనని చెప్పిన మొగోడు కేసీఆర్
  • వరంగల్ పర్యటనలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్
  • హన్మకొండ : ఏడు నెలల పసిగుడ్డు ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏం సాధించారని మాట్లాడుతున్నారని రాష్ట్ర గ్రామీణ, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. శనివారం పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్‌తో కలిసి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన కె.తారకరామారావుకు టీఆర్‌ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.

    హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రజా కోర్టులో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారన్నారు.  ప్రజా కోర్టులో ఇచ్చిన తీర్పును కాదని కేసీఆర్‌పై సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేస్తామని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. గతంలో మీరు చేసిన తప్పిదాలకు కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకోండి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి ముందుగా మీపై ఉన్న కేసుల్లో నుంచి బయటపడండి.. అని ఎద్దేవా చేశారు.

    పదవులకై పెదవులు మూసుకొన్న నాయకులు, దశాబ్దాలుగా మంత్రిగా ఉండి ఏం సాధించారో చెప్పాలని తూర్పారబట్టారు. మీరు ఏం చేయకపోవడంతో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారన్నారు. దుర్మార్గంగా అవాకులు చెవాకులు పేల్చుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మెరుగైన అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై గల్లీగల్లీ తిరిగి ప్రజలందరినీ కూడగట్టి అహంకారంతో ఉన్న కాంగ్రెస్‌ను నేలకు దించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.

    చరిత్రలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులపాటు వరంగల్‌లోనే ఉండి నాలుగు నియోజకవర్గాల్లోని పేదల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని వారికి పక్కా ఇళ్లు కట్టించి, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించి ఏ ఆడబిడ్డ కూడా బిందెతో రోడ్డెక్కొద్దని చెప్పడం కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు.   నల్లగొండ జిల్లాలో ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతుంటే వారి కష్టాలు చూసి రక్షిత మంచినీటిని నల్లగొండ జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నాలుగేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందిస్తానని, లేకపోతే ఓట్లడగనని చెప్పిన మొగోడు కేసీఆర్ అన్నారు.

    ఎస్సీ ఎస్టీ, మైనారిటీ పేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.51 వేల ఆర్థిక సహాయం అందించే కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం, దళితులకు మూడెకరాల సాగుభూమి, పింఛన్లు రూ.200 నుంచి రూ.వె య్యి, రూ.1500లకు పెంచడమే కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఏ తప్పు చేశారని కేసులు పెడతామని మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు.

    తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు గనులున్నా, పక్కనే గోదావరున్నా కరెంట్‌కై కష్టాలు పడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించి మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధించాలనే కార్యాచరణతో ముందుకు పోతున్నారన్నారు.

Advertisement
Advertisement