చేను కిందే చెరువు! | Sakshi
Sakshi News home page

చేను కిందే చెరువు!

Published Tue, May 19 2015 2:36 AM

చేను కిందే చెరువు! - Sakshi

వాన నీటి సంరక్షణపై  ‘సాక్షి’ ఆధ్వర్యంలో సదస్సు
 రైతులకు అవగాహన కల్పించిన నిపుణులు

 
రంగారెడ్డి జిల్లా: పొలంలో నీటి నిల్వతోపాటు భూగర్భ జలాల భారీగా పెంపొందించే అంశంపై ‘సాక్షి’ మీడియా గ్రూప్, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం సంయుక్తంగా తలపెట్టిన రైతు సదస్సుకు విశేష స్పందన లభించింది. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గ కేంద్రాల్లో వేర్వేరుగా నిర్వహించిన రైతు సదస్సులు రైతుల్లో సరికొత్త ఆలోచనలు నింపింది. ‘చేను కిందే చెరువు’ అనే నినాదంతో తలపెట్టిన ఈ కార్యక్రమం.. వర్షపునీటిని సద్వినియోగం చేసుకుంటూ నీటి ఎద్దడిని ఎదుర్కొనగలమనే ధీమాను నింపింది. ప్రస్తుతం భూగర్భ జలాలు భారీగా పతనమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి సాగును మరింత లాభదాయకం చేసేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూపు రైతు అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డిలు పాలుపంచుకున్నారు.

నా పొలం నుంచే శ్రీకారం: మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నంలో బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన రైతు సదస్సుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందకాల ఆలోచన అభినందనీయమని చెప్పారు. ముందుగా తన పొలంలో కందకాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.  
 
కందకాలతో కొత్త మలుపు..

పొలంలోనే భూమి పైభాగం నుంచి నిర్ణీత లోతు వరకు కందకాలు తవ్వుకోవాల్సి ఉంటుంది. తద్వారా వర్షపు నీరు ఈ కందకాల్లో నిల్వ అవుతాయి. ఫలితంగా పొలంలోనే భూగర్భ జలాల మట్టం పెరుగు తుంది. ఇందుకు రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం నుంచి నిపుణులు రైతు పొలం వరకు వచ్చి సలహాలు ఇవ్వనున్నట్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డిలు ప్రకటించారు.
 

Advertisement
Advertisement