చదువులు సాగేనా? | Sakshi
Sakshi News home page

చదువులు సాగేనా?

Published Sun, Jul 27 2014 1:20 AM

చదువులు సాగేనా? - Sakshi

ఫలితాలు వెలువడి నెలలు గడుస్తున్నా..
ఊసేలేని వృత్తివిద్యా కోర్సుల కౌన్సెలింగ్
కోర్టుకు చేరిన ‘స్థానిక’ వివాదం
ఫీజుల చెల్లింపుపై వీడని అయోమయం
విద్యాసంవత్సరం నష్టపోయే ప్రమాదం
విద్యార్థుల భవిత అగమ్యగోచరం
 కరీంనగర్ ఎడ్యుకేషన్: ఫీజులు, స్థానికత అంశాలపై నేటికీ స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థల నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. వివిధ వృత్తివిద్యా    కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందా, కాలేజీలో ఎప్పుడు చేరుతామా.. అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఈసెట్, ఎల్‌ఎల్‌బీ, డీఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు జరిగి, ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నాయి. కానీ.. ఇంతవరకు కౌన్సెలింగ్ తేదీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాలు కొంత ఆలస్యమవుతాయనుకున్నా ఇప్పటికీ ఎటూ తేలకపోవడంతో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. కౌన్సెలింగ్‌లు పూర్తయి ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. అసలు ఆ ఊసే కనిపించడం లేదు. ఎప్పుడు నిర్వహిస్తారనే విషయమై కనీసం ప్రభుత్వానికి కూడా స్పష్టత రావడం లేదు.
 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో కొత్తగా ‘ఫాస్ట్’ పథకానికి రూపకల్పన చేసింది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడినవారి పిల్లలకు మాత్రమే ఫీజు చెల్లిస్తామని ప్రకటించింది. ఇంతకుమించి పథకంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మార్గదర్శకాలు రాకపోవడంతో అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

దీంతో చాలాచోట్ల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చాలామేర పాతబకాయిలున్నాయి. వాటిని మంజూరు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రకియ కోసం అక్టోబర్ వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును కోరడంతో ప్రవేశాలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇవన్నీ పరిష్కారమయ్యేదెన్నడో? కౌన్సెలింగ్ జరిగి తాము కళాశాలలకు వెళ్లి చదువుకునేదెప్పుడో? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 
గందరగోళం

విద్యాసంవత్సరం వెనకబడుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ కోర్సు ఆలస్యమైతే తరువాత ఉన్నత విద్యకోసం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. తరగతులు ఆలస్యమై విద్యాసంవత్సరం పొడిగిస్తే ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదముంది. పాలిటెక్నిక్‌లో సీటు రాకపోతే ఇంటర్మీడియెట్‌లో చేరుదామని పదో తరగతి పూర్తయిన విద్యార్థులు, మెడిసిన్, ఇంజినీరింగ్‌లో సీటు రాకపోతే డిగ్రీలో చేరదామని అనుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. పాలిసెట్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల తనిఖీ పూర్తయింది.

సీట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈసెట్ పరీక్ష రాసిన వారి పరిస్థితి వింతగా తయారైంది. వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాగా సీట్ల కేటాయింపు నిలిచిపోయింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ రెండో తరగతి పాఠ్యాంశాలు జూలై 1నే ప్రారంభం కాగా, ఈసెట్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల విషయంలో స్పష్టతనిచ్చి, త్వరగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి, విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
భయంగా ఉంది
పాలిటెక్నిక్ పూర్తయి ఈసెట్ ఎంట్రెన్స్ రాసిన. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సీటు కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నా. ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండియర్ తరగతులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రభుత్వం త్వరగా సీట్లు కేటాయిస్తే మేం తరగతులు నష్టపోకుండా ఉంటాం. మాకు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలి.
 - సాయిశ్రీ, పాల్‌టెక్నిక్ విద్యార్థి

 కౌన్సెలింగ్ నిర్వహించాలి
 ప్రభుత్వం లేట్ చేయకుండా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఎంసెట్ ఫలితాలు వెలువడి చాలా రోజులైంది. ఏటా ఆగస్టులో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయి తరగతులు మొదలయ్యేవి. ఈ సారి కౌన్సెలింగ్ ప్రస్తావనే రావడం లేదు. ఇక తరగతులు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలవడం లేదు. ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలి.
 - కాల్వ సుష్మితారెడ్డి, ఇంటర్ విద్యార్థిని

Advertisement

తప్పక చదవండి

Advertisement