విద్యావంతులే కానీ.. పనిమంతులు కాదు.. | Sakshi
Sakshi News home page

విద్యావంతులే కానీ.. పనిమంతులు కాదు..

Published Fri, Sep 4 2015 2:28 AM

Educator but not mantulu work .. ..

రాష్ట్రంలో 61 శాతం మంది విద్యార్థుల్లో ఉపాధికి అవసరమైన నైపుణ ్యం లేదు
పరిశ్రమ సహకారంతో కూడిన     విద్యావిధానానికే ఉపాధ్యాయుల మొగ్గు
విద్యాబోధనలో టెక్నాలజీ అవసరమంటున్న 66 శాతం మంది టీచర్లు
పియర్సన్ వాయిస్ ఆఫ్ టీచర్స్ సంస్థ సర్వేలో వెల్లడి

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 61 శాతం మంది విద్యార్థులకు ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యం లేదట. పియర్సన్ వాయిస్ ఆఫ్ టీచర్స్ అనే సంస్థ  నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే వివరాలను పియర్సన్ సంస్థ గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్త సర్వేలో భాగంగా తెలంగాణలోని 15 నగరాలు, పట్టణాల (ఆదిలాబాద్, డోన్, ఘట్‌కేసర్, హుజూరాబాద్, హైదరాబాద్, సైబరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొంపల్లి, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సికింద్రాబాద్, సూర్యాపేట్, వనపర్తి) నుంచి ఉపాధ్యాయుల అభిప్రాయాలను పియర్సన్ సంస్థ సేకరించింది. విద్యారంగానికి సంబంధించి ముఖ్యమైన ఆలోచనలు, సాధ్యమయ్యే పరిష్కారాలు, ఉపాధి, పరిశ్రమ సహకారంతో నూతన విద్యావిధానం రూపకల్పన.. తదితర అంశాలపై ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలను తీసుకుంది.

తెలంగాణలో 75 శాతం మంది ఉపాధ్యాయులు పరిశ్రమ సహకారంతో విద్యావిధానానికి(కరిక్యులమ్) ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఇది ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారని పేర్కొంది. అలాగే విద్యాభివృద్ధికి అవసరమైన యాక్షన్ పాయింట్ల లోపాన్ని 50 శాతం మంది టీచర్లు ఎత్తిచూపారని, టెక్నాలజీ అత్యంత ఖరీదుగా ఉండడం తాము ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యగా వారు పేర్కొన్నారని పియర్సన్ వెల్లడించింది. ప్రతి విద్యా సంస్థలో కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించడం ద్వారా విద్యలో సాంకేతిక వినియోగం మెరుగవుతుందని 66 శాతం మంది టీచర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు పియర్సన్ వాయిస్ ఆఫ్ టీచర్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా సర్వే వివరాలను పరిశీలిస్తే.. ఉపాధికి అనువైన నైపుణ్యం 57 శాతం మందికి లేదని, పరిశ్రమకు అనుగుణమైన కరిక్యులమ్ కావాలని 75 శాతం మంది టీచర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
 
 

Advertisement
Advertisement