ఒకరు పాడెపై.. మరొకరు స్ట్రెచర్‌పై.. | Sakshi
Sakshi News home page

ఒకరు పాడెపై.. మరొకరు స్ట్రెచర్‌పై..

Published Sun, Oct 28 2018 11:38 AM

Eight Year Old Boy Died With Dengue Fever Warangal - Sakshi

సాక్షి, ఏటూరునాగారం: డెంగీ మహమ్మారి ఆ కుటుంబంతో ఆడుకుంటోంది. చేతిలో చిల్లిగవ్వలేక.. ఆపదలో ఆదుకునే ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోవడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మెరుగైన వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఒక కొడుకు పాడెపై పడుకుంటే.. మరో కుమారుడు వెంటిలెటర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హృదయవిదారక సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు పంచాయతీ పరిధిలోని సింగారంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన వావిలాల పోతరాజు, జయమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు వావిలాల వినయ్‌ (9) డెంగీ జ్వరంతో బాధపడుతూ శనివారం ఉదయం ఎంజీఎంలో మృతి చెందాడు. వినయ్‌కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో ఏటూరునాగారంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ నయం కాలేదు. కాలేయానికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని, రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయని వైద్యులు చెప్పడంతో ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు కుమారుడిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాలుగు రోజులుగా చికిత్స అందిస్తుండగా శనివారం మృతిచెందాడు.

వెంటిలెటర్‌పై రెండో కుమారుడు 
పెద్ద కుమారుడు చనిపోవడంతో తల్లి జయమ్మ ఆయన మృత దేహాన్ని పట్టుకుని సింగారం గ్రామంలోని తన ఇంటికి చేరింది. రెండో కుమారుడు వావిలాల వినోద్‌కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సేవలు చేస్తున్నాడు.  వినోద్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై పెట్టి చికిత్సలు అందిస్తున్నారు. ఇటు మృతిచెందిన పెద్ద కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహించలేక.. చిన్న కుమారుడిని ఎలా బతికించుకోవాలో తెలియక గుండెలవిసేలా రోదిస్తున్నాడు.

బిడ్డా.. కానరాని లోకానికి పోతివా...
పండుగొచ్చిందని కొత్త బట్టలు కూడా కుట్టిస్తిని బిడ్డా.. అవి మాసిపోకుండానే మట్టిలో కలిసిపోతివా.. నీ దగ్గర నేను ఉన్నా... తమ్ముడి దగ్గర అయ్య ఉన్నాడు. ఏం చేయాలి బిడ్డా.. దేవుడా మమ్మల్లి ఇంత కష్టంలో ఎందుకు నెట్టావు. ఆలన పాలన తెలియని బిడ్డలను ఆగం చేస్తివి. నా కొడుకును పొట్టనపెట్టుకుంటివి అంటూ వినయ్, వినోద్‌ తల్లి జయమ్మ విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

అయ్యా.. నా బిడ్డను కాపాడండి...
మాకు ఆరోగ్య శ్రీ కూడా లేదు. నా పెద్ద కొడుకును డబ్బులేకనే పోగొట్టుకున్నా. నా చిన్న కొడుకు వినోద్‌కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలో చికిత్స చేయిస్తున్నా. చేతిలో చిల్లిగవ్వలేదు. ఆడ ఈడ అప్పులు చేసి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి.  డబ్బులుంటనే నా కొడుకు బతుకుతాడు. తెలిసిన వారికల్లా ఫోన్‌ చేసి అడుగుతున్నా. నా కొడుకును కాపాడాలని. – పోతరాజు, వినోద్‌ తండ్రి  

Advertisement
Advertisement