Sakshi News home page

‘పరిషత్’ ..షరతులివే..!

Published Thu, May 29 2014 2:38 AM

Election Commission to hold the election of the Zilla Parishad is the ruling class.

 అధికార యంత్రాంగం ఇప్పుడు మండల, జిల్లా పరిషత్‌లకు కార్యవర్గాల ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలను విడుదల చేయడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘స్థానిక’ సమరంలో వివిధ రాజకీయ పక్షాల తరఫున ఎన్నికైన వారు చైర్మన్‌లను, కో-ఆప్టడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
 
 జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల ఎన్నికల నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మండల పరిసత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన పలు నిబంధనలను  జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వుల  కాపీ సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరింది. పాలక వర్గాల ఏర్పాటుకు సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
 నిబందనలివి...
 పంచాయతీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 149(1)(వీ) ప్రకారం ప్రతీ మండలానికి ఒక మైనారిటీని కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకోవాలి. అతను సంబంధిత మండలంలో ఓటరై ఉండాలి. 21 ఏళ్లు నిండిన వారు అర్హులు.
 
 సెక్షన్ 153(1) ప్రకారం ప్రతీ మండలంలో ఒక అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని సభ్యులు చేతులెత్తి ఎన్నుకోవాలి. గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్‌మేరకు వారిని సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ విప్‌ను  దిక్కరిస్తే ఆయన సభ్యత్వాన్ని  సీజ్ చేసే అధికారం ఆయా పార్టీలకు  ఉంటుంది.
 
 సెక్షన్ 177 (3)(వీ) ప్రకారం జిల్లా పరిషత్‌కు ఇద్దరు మైనార్టీలను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. 21 ఏళ్లు నిండి, జిల్లాలో ఓటు హక్కు ఉన్నవారు ఇందుకు అర్హులు.
 
 సెక్షన్ 181(1)  ప్రకారం జెడ్పీ చైర్మన్‌ను సభ్యులు చేతులెత్తి ఎన్నుకోవాలి. ఇక్కడ   కూడా గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకు ఆయా పార్టీల సభ్యులు నడుచుకోవాల్సి ఉంటుంది. విప్‌ను ధిక్కరిస్తే జెడ్పీటీసీ సభ్యత్వాన్ని సీజ్ చేసే అధికారం ఆయా పార్టీలకు ఉంటుంది.
 
 మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకునేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సభ్యులు, కోఆప్షన్‌సభ్యులు మాత్రమే అర్హులు
 ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్థానిక సంస్థల్లో ఓటు హక్కులేదు. వారు ఆయా సంస్థల్లో జరిగే సమావేశాలకు హాజరైతే కూర్చొనేందుకు ప్రత్యేక స్థానాలను మాత్రమే కేటాయించాలి.
 
 సమావేశ భవనంలో ఎలాంటి ప్రచారాలకు అనుమతి ఇవ్వరాదు. అలాగే సభ్యులపై ప్రలోభాలు జరగకుండా చూసుకోవాలి.
 
 ఏవైనా కారణాల వల్ల కోఆప్షన్ సభ్యు ల ఎంపిక జరక్కపోతే ఆ సమాచారాన్ని వెంటనే ఎస్‌ఈసీకి తెలియజేయాలి.
 
 ఈ ఎన్నికలకు సబంధించిన ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా కోరం ఉండాలి.దీనికోసం గంటసేపు నిరీక్షించవచ్చు. అప్పటికి కోరం లేకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదా వేయాలి. ఆ రోజు కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోతే విషయాన్ని ఎస్‌ఈసీ దృష్టికి తేవాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement