జప్తు జబర్దస్త్..! | Sakshi
Sakshi News home page

జప్తు జబర్దస్త్..!

Published Wed, Dec 5 2018 9:27 AM

Election Staff Suffering With Transport Department - Sakshi

ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలింపునకు సమాయత్తం  వాహనాల వేటలో తలమునకలైన ఆర్టీఏ అధికారులుఆ డ్యూటీలు తమకొద్దంటున్న ట్రావెల్స్‌ నిర్వాహకులుఅద్దెలు అతి తక్కువ.. అవీ చెల్లిస్తారో లేదోననే భయంరాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 వాహనాలు అవసరంగ్రేటర్‌ హైదరాబాద్‌కే కావాల్సినవి 1,500 వాహనాలు

సాక్షి, సిటీబ్యూరో: ‘డేవిడ్‌ సొంత వాహనం ఉన్న డ్రైవర్‌. తన ఇన్నోవా వాహనాన్ని ఓ కాల్‌సెంటర్‌కు అద్దె ప్రాతిపదికన నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం ఎన్నికల విధుల కోసం ఆర్టీఏ అధికారులు ఆ వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు బండిని తమకు అప్పగించాలని కోరారు. అధికారుల ఒత్తిడితో మరో గత్యంతరం లేకపోయింది. కానీ సదరు కాల్‌సెంటర్‌ మాత్రం తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వారం పాటు తమకు వాహనం అందుబాటులో లేకపోతే చాలా నష్టం వస్తుందంటూ నిర్వాహకులు స్పష్టం చేశారు. వారం రోజుల ఎన్నికల విధుల కోసం డేవిడ్‌ తన ఉపాధినే కోల్పోవాల్సి వచ్చింది’  ఈ పరిస్థితి డేవిడ్‌ ఒక్కడిదే కాదు. నగరంలో చాలామంది వాహనదారులు, ట్రావెల్స్‌ సంస్థలు కొద్ది రోజులుగా ఆర్టీఏ దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ తమ వాహనాన్ని జప్తు చేస్తారో తెలియని అనిశ్చితితో ఆందోళనకు గురవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కాల్‌సెంటర్స్, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కాంట్రాక్ట్‌ పద్ధతిన వాహనాలను అద్దెకు నడుపుతున్న  ట్రావెల్స్‌ ఏజెంట్లు, సంస్థలు, వాహన యజమానులు, డ్రైవర్లు ఉన్నపళంగా తమ వాహనాలను  ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరోవైపు ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌ సంస్థలతో అనుసంధానమైన వాహనాలు నడుపుతున్న భాగస్వామ్య డ్రైవర్‌లకు సైతం ఇది  ఇబ్బందికరంగానే ఉంది. నాలుగైదు రోజుల ఎన్నికల డ్యూటీలతో  శాశ్వత ఉపాధి కోల్పోవాల్సివస్తుందని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదేం బలవంతం..?
ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, సామగ్రి చేరవేత, భద్రతా ఏర్పాట్లు తదితర అవసరాల కోసం ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 70 వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్నోవా, క్వాలిస్, టవేరా, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు వంటి అన్ని రకాల వాహనాలపై  అధికారులు దృష్టి సారించారు. మొత్తం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు సుమారు 3,500 వాహనాలు ఏర్పాటు చేసేందుకు రవాణా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ఒక్క  గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే సుమారు 1,500కుపైగా వాహనాలను సిద్ధం చేస్తున్నారు. తీరా ఎన్నికల తేదీ ముంచుకొచ్చిన తరుణంలో నాలుగైదు రోజులుగా  బలవంతంగా వాహనాల జప్తు చేస్తున్నారు. దీంతో అప్పటికే బుకింగ్‌లు చేసుకున్న వారు ఇబ్బందులకు గురికావాల్సివస్తోంది. ముందస్తుగానే ఈ ప్రక్రియ ప్రారంభించి ఉంటే వినియోగదారులకు మరో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేవాళ్లమని హిమాయత్‌నగర్‌కు చెందిన వాహన యజమాని రవి ఆందోళన వ్యక్తం చేశారు.

అద్దెలు చాలా తక్కువ..
ఎన్నికల విధుల కోసం స్వాధీనం చేసుకున్న ఇన్నోవా, క్వాలిస్, టవేరా వంటి వాహనాలకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ కాకుండా రోజుకు రూ.1000 చొప్పున అద్దె చెల్లించనుండగా, ప్రైవేట్‌ సంస్థల నుంచి మాత్రం తమకు రూ.2600 వరకు లభిస్తుందని, ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వడం వల్ల రోజుకు రూ.1600 వరకు ఆదాయం కోల్పోవాల్సివస్తుందని వాహనదారులు  పేర్కొంటున్నారు. దీంతో ఇది తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలంగాణ ఫోర్‌వీలర్స్‌  డ్రైవర్స్, ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులను దృష్టిలో ఉంచుకొని ట్రావెల్స్‌ సంస్థలు, డ్రైవర్లు, వాహన యజమానులు తమకు సహకరించాలని రవాణా అధికారులు సూచించారు. 

Advertisement
Advertisement