‘కాంటా’ తంటాలు | Sakshi
Sakshi News home page

‘కాంటా’ తంటాలు

Published Tue, Jun 17 2014 12:05 AM

‘కాంటా’ తంటాలు - Sakshi

- ఎలక్ట్రానిక్ త్రాసులతో వ్యాపారుల మోసం
- దుకాణాల్లో, వ్యవసాయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి
- నిమ్మకునీరెత్తిన తూనికలు, కొలతల శాఖ అధికారులు

 పరిగి: పట్టణంలోని కొందరు వ్యాపారులు హైటె(క్ని)క్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలతో వినియోగదారులను నట్టేటా ముంచుతున్నారు. వ్యాపారులు ప్రస్తుతం తూనికలు, కొలతల శాఖ అధికారుల అదేశాలతో దుకాణాలు, అడ్తీల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుడు ఎలక్ట్రానిక్ కాంటాలను చూడగానే కొండంత భరోసాతో గండెమీద చేయి వేసుకుని కొనుగోళ్లు జరుపుతుంటాడు.

కారణం.. యంత్రాలు మోసం చేయవని. కాని కొందరు వ్యాపారులు నిపుణులైన వారితో యంత్రాలకు ఉన్న స్క్రూలను తిప్పి సెట్టింగ్ మార్చి వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఇటీవల కొందరు వినియోగదారులు తాము కొనుగోలు చేసిన కేక్‌లు, స్వీట్లు, స్టీల్ పరిమాణం తక్కువగా ఉందని అనుమానించి మరో చోట తూకాలు వేయించగా మోసపోయినట్లు తేలింది.   
 
భారీ స్థాయిలో మోసం...
కొందరు స్టీల్ వ్యాపారులు భారీ మోసానికి పాల్పడుతున్నారని పలువురు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులు దాదాపు 20 శాతానికి పైగా మోసపోతున్నారని చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు నిలువుగా దగాకు గురవుతున్నారు. పత్తి, కందులు, పెసలు, వేరుశనగ తదితరాలు కొనుగోలు చేసే వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలతో మోసం చేస్తున్నార నే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిగిలోని కూరగాయల మార్కెట్‌లో ఇప్పటికీ తూకాలకు బండరాళ్లనే వినియోగిస్తున్నారు.  

వెలుగుచూసిన మోసాలు ఇవి..
పరిగి పట్టణంలో ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో భయానక  మోసాలు వెలుగుచూశాయి. ఓ స్టీల్, సిమెంట్ దుకాణాల్లో తూనికల్లో తీవ్రస్థాయిలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఓ దుకాణంలో పత్తి తదితర రైతు ఉత్పత్తులకు క్వింటాలుకు 3-5 కిలోలు తనకు ఎక్కువగా వచ్చేలా వ్యాపారి ఎలక్ట్రానిక్ కాంటాను సెట్ చేసుకున్నట్లు బయటపడింది. మరో స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడర్స్‌లో 15-20 శాతం స్టీల్ వినియోగదారులకు తక్కువగా ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నాలుగు బేకరీలపై దాడులు నిర్వహించి వినియోగదారులు మోసపోతున్నట్లు గుర్తించారు. ఓ బేకరీలో 2 కిలోల కేక్ కొనుగోలు చేయగా 950 గ్రాముల బరువు తక్కువగా ఉంది. మరో బేకరీలో 2 కిలోలకు 500 గ్రాములు తక్కువ వచ్చేలా ఎలక్ట్రానిక్ కాంటాలో సెట్టింగ్ ఉంది. ఈవిషయాలు తూనికలు, కొలతల విభాగం ఇన్‌స్పెక్టర్ ప్ర భాకర్‌రెడ్డి వెల్లడించారు. దీనిని బట్టి పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు.
 
పట్టించుకోని అధికారులు..
తూనికలు, కొలతల శాఖ అధికారుల మొద్దు నిద్రతోనే వ్యాపారులు దర్జాగా వినియోగదారులను మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎప్పుడో ఆరు నెలలకోసారి తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాట.. అన్న విధంగా తయారైంది. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, ఈనేపథ్యంలోనే పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement