పత్తాలేని ‘ఈ–పట్టా’! | Sakshi
Sakshi News home page

పత్తాలేని ‘ఈ–పట్టా’!

Published Mon, May 1 2017 1:33 AM

పత్తాలేని ‘ఈ–పట్టా’!

- రెండేళ్ల కిందటే డిజైన్లను ఆమోదించిన ప్రభుత్వం
- అన్ని జిల్లాల్లోనూ నిలిచిన పాసు పుస్తకాల జారీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పడి మూడేళ్లవుతున్నా పట్టాదారు పాసు పుస్తకాలు ఇంకా ఏపీ పేరు మీదే ఉన్నాయి. వాటిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి రెండేళ్లు అయినా అమలులో అడుగు ముందుకు పడడం లేదు. ఎలక్ట్రానిక్‌(ఈ)పట్టాదార్‌ పాసు పుస్తకాలు, ఈ– యాజమాన్యపు హక్కు(టైటిల్‌ డీడ్‌) పత్రాల కోసం కొత్త డిజైన్‌లను కూడా అప్పట్లో ఆమోదించింది. దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం పట్టాదారు పాస్‌పుస్తకాల రూపాన్ని మారుస్తుండడం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం పేరిట పాసుబుక్‌లు, టైటిల్‌ డీడ్‌లు వస్తున్నాయని తెలిసి రైతులతోపాటు రెవెన్యూ వర్గాలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాయి.

సుమారు 25 లక్షల పాత పుస్తకాలు ఏపీ పేరు మీదనే ఉన్నాయి. రాష్ట్రమేర్పడిన తర్వాత కొత్త పాస్‌పుస్తకాల జారీని ప్రభుత్వం నిలిపివేయడంతో సుమారు 5 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలను పొందలేకపోతున్నారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ పోస్ట్‌ను ఎంతోకాలంగా ప్రభుత్వం భర్తీ చేయకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకే సీసీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగిస్తుండడంతో క్షేత్రస్థాయి పరిస్థితులపై పర్యవేక్షణ లోపించింది.

జిల్లా కలెక్టర్లకు అందని ఆదేశాలు
ప్రభుత్వం ఆమోదించిన కొత్త డిజైన్ల(రంగులు, స్లోగన్లు, ఎంబ్లమ్‌)లోనే ఎలక్ట్రానిక్‌ పాస్‌బుక్‌లు, టైటిల్‌ డీడ్‌లను జిల్లాల్లోనే ముద్రించాలని భూపరిపాలన విభాగం 2015 ఆగస్టులోనే నిర్ణయించింది. పట్టాదారు పాసుపుస్తకానికి, యాజమాన్యపు హక్కు పత్రానికి ప్రత్యేకమైన కోడ్, నంబరు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్డీవో) సంతకం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. పాస్‌బుక్, టైటిల్‌డీడ్‌ల మొదటి పేజీకి వాటర్‌ మార్క్‌డ్‌ మ్యాప్‌లిథో పేపరునే వినియోగించాలని, రైతు ఫొటోను అతికించి, ఆర్డీవో సంతకం చేశాక ఆపేజీని భద్రతరీత్యా లామినేషన్‌ చేయించాలని నిర్ణయించారు.

కానీ, ఈ–పాస్‌బుక్‌ల జారీపై జిల్లా కలెక్టర్లకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆమోదించిన ఈ–పట్టాదార్‌ పాస్‌బుక్‌ కవర్‌పేజీపై రైతు, రైతుకూలీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, చివరిపేజీపై బంగారు తెలంగాణకు బాటలు వేయండని స్లోగన్లు ఉన్నాయి. పాస్‌బుక్, టైటిల్‌ డీడ్‌ల మొదటి పేజీలో వ్యవసాయదారుని పేరు, చిరునామా, భూమి ఉన్న గ్రామం.. తదితర వివరాలుంటాయి. ఈ వివరాలను ధ్రువీకరిస్తూ వ్యవసాయదారుడు, తహసీల్దారు, ఆర్డీవోలు సంతకం చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement