హెచ్‌డీసీసీబీలో రాజుకున్న వివాదం! | Sakshi
Sakshi News home page

హెచ్‌డీసీసీబీలో రాజుకున్న వివాదం!

Published Mon, Jun 16 2014 11:58 PM

హెచ్‌డీసీసీబీలో రాజుకున్న వివాదం! - Sakshi

- పాలకవర్గం అనుమతి లేకుండానే ముగ్గురికి పదోన్నతులు కొందరు కిందిస్థాయి
- ఉద్యోగులకు బదిలీలు సమావేశాన్ని బహిష్కరించిన సభ్యులు
- చైర్మన్‌కు అన్నీ చెప్పామంటున్న డీసీసీబీ సీఈఓ

సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (హెచ్‌డీసీసీబీ)లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గత పాలకవర్గం హయాంలో నిధుల గోల్‌మాల్‌తో తీవ్ర దుమారం సృష్టించిన హెచ్‌డీసీసీబీ... ప్రస్తుతం ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల అంశం తాజా వివాదానికి కారణమైంది. పాలకవర్గం అనుమతి లేకుండా ముగ్గురు అధికారులకు పదోన్నతులు కల్పించారు. కొందరు కిందిస్థాయి ఉద్యోగులను బదిలీ చేశారు. పాలకవర్గం అనుమతి లేకుండానే ఇవన్నీ చేయడంపై సభ్యులు భగ్గుమన్నారు. సోమవారం బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో వివాదం మరింత రసకందాయంగా మారింది.  
 
ఏకపక్ష నిర్ణయంతో...
డీసీసీబీ పరిధిలోని ముగ్గురు ఉద్యోగులకు ఇటీవల పదోన్నతి కల్పించారు. ఇందులో ఇద్దరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ క్యాడర్‌కు వెళ్లగా, మరొకరు డిప్యూటీ జనరల్ మేనేజర్ కేడర్‌కు వచ్చారు. సాధారణంగా బ్యాంకు ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వాల్సి ఉంటే ముందుగా హెచ్‌ఆర్‌డీ కమిటీ ఆమోదం తీసుకోవాలి. కానీ ఈ కమిటీ ఆమోదం లేకుండానే ముగ్గురు అధికారులకు పదోన్నతులివ్వడం వివాదాస్పదమైంది. చైర్మన్ ఆమోదంతో పదోన్నతులిచ్చామని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ప్రక్రియ ఏకపక్షంగా జరగిందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బదిలీల్లో గోప్యత...
సిబ్బంది బదిలీల అంశం సైతం డీసీసీబీ పాలకవర్గంలో ముసలం రేపింది. పాలకవర్గం సమావేశంలో ఆమోదం తెలిపి తీర్మానం చేపట్టిన తర్వాతే బదిలీలు చేయాలనే నిబంధనలను బ్యాంకు అధికారులు పక్కనపెట్టారు. బదిలీలు చేపట్టారు. ఇతర విభాగాల్లో ఉద్యోగులు వచ్చినందున డీసీసీబీ పరిధిలో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రాధాన్యత క్రమంలో భాగంగా పలువురు ఉద్యోగులను బదిలీ చేశామని అధికారులు చెబుతుండడం గమనార్హం.
 
చైర్మన్‌కు చెప్పే చేశాం: డీసీసీబీ సీఈఓ రాందాస్

అధికారుల పదోన్నతితో పాటు ఉద్యోగుల బదిలీ అంశం మొత్తం చైర్మన్ అనుమతితోనే చేశాం. సోమవారం నాటి పాలకవర్గ సమావేశంలో ఈ అంశాలకు ప్రాదాన్యత ఇస్తూ నోట్ రూపొందించాం. సభ్యులకు ఈ విషయాల్ని వివరించే లోపే సమావేశం నుంచి నిష్ర్కమించారు. దీంతో వారికి విషయాన్ని వివరించలేకపోయాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement