ఉద్యోగుల కనీస వేతనం రూ. 9,880 | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కనీస వేతనం రూ. 9,880

Published Sun, Mar 24 2019 3:36 AM

Employees minimum wage of Rs 9880 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా ఉండాలని జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ నిర్ధారించింది. దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ గతంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించిన నిపుణుల కమిటీ... జాతీయ స్థాయిలో ఐదు రీజియన్‌లను గుర్తించగా తెలుగు రాష్ట్రాలను రెండో రీజియన్‌లో చేర్చింది. జూలై 2018 నాటి స్థానిక పరిస్థితులు, ధరల సూచీలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ కనీస వేతనాన్ని నిర్ధారించింది. 2012 కంటే ముందు జాతీయ స్థాయిలో ఉద్యోగి కనీస వేతనం రూ. 4,570గా ఉండేది.

గత ఏడేళ్లలో జీవన వ్యయంలో భారీ మార్పులు వచ్చాయి. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వేతన సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం ఆ మేరకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి కనీస వేతన మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను ఇటీవల కేంద్ర కార్మిక శాఖకు అందజేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం కనీస వేతన విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. 

తక్కువ వేతనం ఉండొద్దు... 
జాతీయ కనీసవేతన నిపుణుల కమిటీ సూచన ప్రకారం ఉద్యోగికి నిర్దేశిత వేతనం కంటే తక్కువగా ఉండొద్దు. తక్కువ వేతనమున్న ఉద్యోగులకు సదరు కంపెనీ యాజమాన్యం నిర్దేశిత వేతనాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల నిర్దేశిత వేతనం కంటే ఎక్కువగా చెల్లిస్తే మాత్రం వేతన పెంపు యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement